గృహలక్ష్మితో గూడు గోస తీరదు

– ఇంటి నిర్మాణానికి రూ.15లక్షలు ఇవ్వాల్సిందే..
– 27లోపు ప్రభుత్వం నిర్దిష్ట ప్రకటన చేయాలి

– ఇండ్ల స్థలాల పోరాటం ఆగదు : తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యపోరాట వేదిక కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ- జైపూర్‌
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గృహలకిë పథకంతో గూడులేని వారి గోడు తీరదని, ఇంటి నిర్మాణానికి రూ.15లక్షలు ఇవ్వాలని తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యపోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య అన్నారు. ఇండ్లు, ఇంటి స్థలాల కోసం చేపట్టిన పేదల పోరాటం ఎవరి బెదిరింపులకూ ఆగదని స్పష్టం చేశారు. పోరాటంలో విజయం సాధించే వరకు పేదలకు ఎర్రజెండా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల సాధన కోసం ఈ నెల 18న మహబూబ్‌నగర్‌ నుంచి ప్రారంభించిన బస్సు యాత్ర శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలం బావురావుపేట్‌ పోరాట కేంద్రానికి చేరుకుంది. బావురావుపేట్‌ శివారులో రెండు నెలలుగా పేదలు చేస్తున్న ఇండ్ల స్థలాల పోరాటానికి మద్దతు తెలిపారు. పోరాట కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీరయ్య మాట్లాడారు.
పేదలు చేపట్టిన భూపోరాటం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చితీరాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా గృహలక్ష్మి పథకం తీసుకొచ్చిందని, ఈ పథకం ద్వారా పేదలకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదని అన్నారు. ఇంటి స్థలం ఉంటే గృహలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు ఇస్తామని చెబుతోందని ఈ నిధులతో నిర్మాణం చేయడం కష్టమని అన్నారు. ఇంటి స్థలం కోసంలేని వారెవరూ గృహలక్ష్మి పథకంతో లబ్దిపొందలేని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం గంపగుత్తగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు రూ.8లక్షలతో నిర్మిస్తుంటే పేదలు వ్యక్తిగతంగా రూ.3లక్షలతో ఇంటి నిర్మాణం ఎలా పూర్తి చేసుకుంటారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పేదలకు ఇంటి సమస్య తీరాలంటే రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వడంతోపాటు రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు మొత్తం రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సొంత ఇల్లు, స్థలం లేనివారు తప్పనిసరై ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. ఎక్కడైతే గుడిసెలు వేసుకున్నారో అక్కడే స్థలం ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం మోసం చేసినందున, రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పకుండా పేదలకు న్యాయం చేయాలన్నారు. ఒక్క చెన్నూర్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 61 కేంద్రాల్లో గతేడాది నుంచి పోరాటం కొనసాగుతోందన్నారు. ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా చేపట్టిన ఈ బస్సు యాత్ర 27న రంగారెడ్డి జిల్లాకు చేరుకుంటుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో బహిరంగ సభకు ముందే ఇండ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఒకవేల ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని, అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బస్సు యాత్ర బృందం సభ్యులు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, వృత్తిదారుల సంఘాల రాష్ట్ర కన్వీనర్‌ పైళ్ల ఆశయ్య, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోట రమేశ్‌, అనుగంటి వెంకటేశ్‌, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు వేముల ఆనంద్‌ సోషల్‌ మీడియా రాష్ట్ర కన్వీనర్‌ జగదీష్‌, ,తదితరులు పాల్గొన్నారు.