నూతన అటవీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

– జీఓ-3 పునరుద్ధరించాలి : తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం
నవతెలంగాణ-మల్హర్‌రావు /మహాముత్తారం
కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన అటవీ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకో వాలని, జీఓ-3 వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్‌ షా ఆదివాసీ ప్రాంతం ఆదిలాబాద్‌ జిల్లాలో ఈనెల 10వ తేదీన పర్యటిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతంలో 100శాతం ఆదివాసీలకు ఉద్యోగాలు కల్పించే జీవో- 3 రద్దు చేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలు ఉద్యోగాలకు దూరం అవుతున్నారన్నారని అన్నారు. కేంద్రం బీజేపీ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి జీవో నెంబర్‌ 3 ని పునర్ధరించాలని డిమాండ్‌ చేశారు, కేంద్ర బీజేపీ తీసుకొచ్చిన జాతీయ నూతన అటవీ చట్టం అమలు జరిగితే పర్యావరణానికి, ఆదివాసులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే 1000 హెక్టార్ల వరకు కార్పొరేట్లకు ఈ చట్టం అప్పనంగా కట్టబెడుతుందని విమర్శించారు. అటవీ ప్రాంతంలోని గూడాలు మొత్తం అటవీ నుండి గెంటి వేయబడతాయని అన్నారు. గ్రామ సభకు కూడా ప్రాధాన్యత లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలకు, అటు పర్యావరణానికి నష్టం చేకూర్చే చట్టాలను తీసుకొస్తూ ఆదివాసి ప్రాంతంలో పర్యటించడం సిగ్గు చేటన్నారు. ఆదివాసి ప్రాంతంలో పర్యటించినంత మాత్రాన ఆదివాసులకు ఏం ప్రయోజనం చేకూరదని అన్నారు. ఆదివాసి ప్రాంతంలో పర్యటించాలనుకుంటే ముందు ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి జీవో-3 పునరుద్ధరించాలని, నూతన అటవీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆదివాసులు అడుగడుగునా అడ్డుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు పోలం చిన్న రాజేందర్‌ మరియు తోట చందన, రాజేశ్వరి, రామినేని శ్రీలత,మల్లక్క, పొలం రాజక్క, జంగ పోసక్క,కండెల లక్ష్మీ,తోట. పవన్‌ తదితరులు ఉన్నారు.