నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి

– అంగన్‌వాడీలకు రూ.26,000 వేతనం ఇవ్వాలి : తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి
నవతెలంగాణ – వనపర్తి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల సమస్యలపై యూనియన్‌ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త జీపు జాతా శుక్రవారం వనపర్తి జిల్లాకు చేరుకుంది. జాతాకు సీఐటీయూ, అంగన్వాడీ నాయకులు జిల్లా కేంద్రంలోని మర్రికుంట ధర్నాచౌక్‌ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. మర్రికుంట దగ్గర ధర్నాచౌక్‌లో యూనియన్‌ జిల్లా అధ్యక్షులు శారద అధ్యక్షత వహించిన బహిరంగ సభలో జయలకిë మాట్లాడారు. ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ 45 సమావేశం తీర్మానం ప్రకారం అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలన్నారు. నూతన జాతీయ విద్యా విధానం పేరుతో అంగన్వాడీ వ్యవస్థను రద్దు చేసేందుకు, అంగన్‌వాడీ టీచర్ల ఉపాధిని తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలపై పనిభారం తీవ్రంగా పెరిగిందని, ఐసీడీఎస్‌కు సంబంధం లేని అనేక విధులను చేయిస్తున్నారన్నారు. ఐసీడీఎస్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధం లేని బీఎల్‌ఓ డ్యూటీలను నిబంధనల ప్రకారం మరెవరికైనా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి, యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు పుట్ట ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు ఏం రాజు, జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్‌, ఎన్‌.రాములు, మద్దిలేటి, యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు కవిత, యూనియన్‌ జిల్లా కార్యదర్శి నారాయణమ్మ, వనపర్తి ప్రాజెక్టు అధ్యక్షులు జి జ్యోతి, కార్యదర్శి సుమతి, ఆత్మకూరు ప్రాజెక్టు నాయకులు వెంకటేశ్వరమ్మ, నాగేంద్రమ్మ, జిల్లా కోశాధికారి రాధా, పెబ్బేరు ప్రాజెక్టు నాయకులు శాంతాబాయి, అలివేల, వనపర్తి నాయకులు విజయలక్ష్మి, ఊర్మిళ పాల్గొన్నారు.