నవయువకుడు కారం పుల్లయ్యను గెలిపించాలి

– పోతినేని సుదర్శన్‌
నవతెలంగాణ-భద్రాచలం/దుమ్ముగూడెం
పోడు కొట్టి సాగు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికీ అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు కల్పించే విధంగా పార్లమెంట్‌లో చట్టం తేవడం జరిగిందన్నారు. ఆనాడు యుపిఏ 2 ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న మిడియం బాబురావు, రాజ్యసభ సభ్యురాలు బృందాకారత్‌ నేతృత్వంలో రూపకల్పన చేసి 2005కు ముందు పోడు కొట్టిన ప్రతి ఒక్కరికీ హక్కు పత్రాలు అందజేయాలని చట్టం తీసుకు రావడం జరిగిందన్నారు. బుధవారం భద్రాచలం అసెంబ్లీ స్థానానికి సిపిఐ(ఎం) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారం పుల్లయ్య నామినేషన్‌ సందర్భంగా జరిగిన సభలో పోతినేని మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ భద్రాచలం అభివృద్ది కోసం ఇస్తానన్న 100 కోట్లు 1000 కోట్లు హామీలుగానే మిగిలాయని అన్నారు. బీఆర్‌ఎస్‌ 10 ఏళ్ల పాలనలో భద్రాచలవలంలో చేసిన అభివృద్ది శూన్యం అన్నారు. ఆనాడు అమరజీవులు కుంజా బొజ్జి, సున్నం రాజయ్యలు ఎమ్మెల్యేలు పని చేసిన సమయంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకోవడం జరిగిందన్నారు. విద్య వైద్య కోసం గిరిజన పాఠశాలలు, భద్రాచలంలో 250 పడకల ఆసుపత్రి నిర్మించుకోవడం జరిగిందన్నారు. దుమ్ముగూడెంలో సున్నంబట్టి వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని చట్ట సభల్లో ప్రశ్నించారన్నారు. భద్రాచలం, భద్రాచల ప్రాంత గిరిజన ప్రజలంటే ముఖ్యంత్రి చంద్రశేఖర్‌రావు చిన్న చూపు చూస్తుందన్నారు. చిత్తశుద్ది కలిగిన సీపీఐ(ఎం) తరపును ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కారం పుల్లయ్యను ఈ నెల 30 తేదీన జరిగే ఎన్నికల్లో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు పై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
భద్రాచలం అభివృద్దికి చిత్తశుద్దితో పని చేసింది కమ్యూనిస్టులే
భద్రాచలం అభివృద్ది కోసం చిత్తశుద్దితో పని చేసింది కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్‌ అన్నారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేలుగా ఉన్న ఎంపి కవిత, ఎమ్మెల్యే పొదెం వీరయ్యలు చెప్పుకోవడానికి తప్ప అభివృద్ధి కోసం తట్టెడు మట్టి వేసిన పాపాన లేదన్నారు. భద్రాచలం పట్టణంలోని పాండవుల గుట్ట మీద రెండవ వాటర్‌ ట్యాంకు, మూడవ వాటర్‌ ట్యాంకు లు కుంజా బొజ్జి, సున్నం రాజయ్యల హయాంలో నిర్మించడం జరిగిందన్నారు. దీంతో పాటు 100 పడకలు, 250 పడకల హాస్పిటల్‌, డిగ్రీ, పిజీ కళాశాలలు నిర్మించడం జరిగిందన్నారు. సమస్త అభివృద్ధి సీపీఐ(ఎం) ప్రజాప్రతినిధుల హయాంలో జరిగాయని అన్నారు.
రెట్టింపు ఉత్యాహంతో కదనరంగంలోకి రావాలి
ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థి కారం పుల్లయ్యను గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. డబ్బు మదంతో పార్టీలు మారిన తెల్లం వెంకట్రావుకు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన పొదెం వీరయ్య గ్రామాల సమస్యలు పట్టించుకోపోగా తమ ప్రభుత్వం వస్తుందని మంత్రిని అవుతానని అభివృద్ధి చేస్తానంటూ కల్లబొల్లి మాటాలు చెబుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని అన్నారు.
డబ్బు మదంతో కలుషిత రాజకీయాలు చేస్తున్నారు
బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నాయకులు డబ్బు మదంతో ఏజెన్సీ ప్రాంతానికి వలస నాయకులను తీసుకు వచ్చి కలుషిత రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ(ఎం) పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ డిసిసిబి చైర్మన్‌ యలమంచి రవికుమార్‌ ఆరోపించారు. దక్షిణ అయోధ్యగా ఉన్న భద్రాచలాన్ని వివక్షకు గురి చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీకి ఇక్కడ పోటీ చేసే అర్హత లేదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు దళిత బందు ఇప్పిస్తామని చెప్పి దళిత బందు పేరుతో పేద దళితుల వద్ద 2 లక్షల నుండి 3 లక్షల వరకు వసూలు చేశారని వారి బండారం బయట పడుతుందన్నారు. భద్రాచలం అభివృద్ధి కోసం తనకు అవకాశం కల్పించాలని అభ్యర్థి కారం పుల్లయ్య అన్నారు. చట్ట సభల్లో ప్రజావాణి వినిపిస్తానని అన్నారు.