పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

–  సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి
నవతెలంగాణ – ముషీరాబాద్‌
నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌ సంఘం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెన్షనర్ల సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా గాయకుడు గద్దర్‌, ప్రజాస్వామ్యవాది ఉర్దూ పత్రిక సంపాదకులు జహీర్‌ అలీఖాన్‌, డెమొక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మారెడ్డి, సంఘం సీనియర్‌ ఉపాధ్యక్షులు అంపయ్యకు సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి, తెలంగాణ రాష్ట్ర పెన్షనర్‌ సంఘం అధ్యక్షులు రాజేంద్రబాబు, జనరల్‌ సెక్రెటరీ నర్సింగ్‌రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాశం యాదగిరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నదన్నారు. ప్రతి నెలా మొదటి తేదీనే బ్యాంక్‌ ఖాతాల్లో పెన్షన్‌ జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం వాయిదాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వేతన సవరణ సంఘాన్ని త్వరితగతిన ఏర్పాటు చేసి మధ్యంతర భృతి ప్రకటించాలని, ఈ కుబేర్‌లో ఉన్న అన్ని బిల్లులను తక్షణమే పరిష్కరించాలని కోరారు. నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సంఘ అసోసియేట్‌ అధ్యక్షులు వీరస్వామి, సీనియర్‌ ఉపాధ్యక్షులు వామన్‌ రావు దేశపాండే, ఆర్థిక కార్యదర్శి నర్సయ్య, గౌరవాధ్యక్షులు నారాయణరావు, ఉపాధ్యక్షులు పురుషోత్తం, రామమ నోహర్‌, మల్లయ్య, సలహాదారులు ఇ. నరసింహారెడ్డి, గోనారెడ్డి, రఘురామిరెడ్డి, అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.