– సాంఘిక భద్రత లేని కొత్త పెన్షన్ విధానం వద్దు : ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీకాంత్ మిశ్రా
నవతెలంగాణ – ముషీరాబాద్
నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీకాంత్ మిశ్రా అన్నారు. అన్ని రంగాల రిటైర్డ్ ఉద్యోగులు, సర్వీస్‌లో కొనసాగుతున్న సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యూనివర్సల్ పెన్షనర్స్ రాష్ట్రస్థాయి కన్వెన్షన్ సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచంలోని 44 దేశాల్లో యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ కల్పిం చడంలో 42వ స్థానంలో ఉందని చెప్పారు. దేశంలో పని చేస్తున్న మొత్తం సంఘటిత రంగంలోని కార్మికుల్లో 75 లక్షల మంది నూతన పెన్షన్ విధానంలో ఉన్నారని తెలిపారు. 15 ఏండ్ల తర్వాత పాత పెన్షన్ విధానంలో ఉండే ఉద్యోగుల సంఖ్య పూర్తి స్థాయిలో తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కూడా నూతన పెన్షన్ విధానంలోని ఉద్యోగులకు అందుబాటులో లేదని చెప్పారు. ఇప్పుడున్న రాజకీయ సమూహాల నేపథ్యంలో ఒక గ్రాల్బుల్ కూడా భవిష్యత్‌లో కొనసాగే అవకాశం కష్టతరమే అన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ రాజకీయ విధానం ప్రకారం ఉద్యోగులెవరికీ సాంఘిక భద్రత కల్పించడానికి సిద్ధంగా లేరన్నారు. స్థిరమైన ఉపాధి పూర్తిగా వశించిపోతున్న సందర్భంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ మొదలగు విధానాలు అంతటా అమలవుతున్న కారణంగా ఉద్యోగ భద్రత సైతం కోల్పోతున్న ఉద్యోగులు సంఘటితమై తమ సాంఘిక భద్రత కోసం పోరాడే అవకాశాలు సన్నగిల్లాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల వివిధ రంగాల ఉద్యోగులతో పాటు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, పింఛనుదారులు, పింఛను పొందలేని వారు కలిసి ఒక కార్యాచరణగా ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఐక్యత ద్వారా యూనివర్సల్ పెన్షన్ విధానం కోసం ప్రయత్నం చేయాలని చెప్పారు.
ఆలిండియా బీఎస్‌ఎన్‌ఎల్ పెన్షనర్స్ సర్కిల్ సెక్రెటరీ రామచంద్రుడు మాట్లాడుతూ.. అత్యంత తక్కువ శాతం మందికి మాత్రమే అందుబాటులో ఉన్న డిఫైన్డ్ పెన్షన్ విధానంలో కూడా అస్తవ్యస్తంగా ఉందన్నారు. 2004 నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో, 2010 నుంచి బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ రంగాల్లో ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ విధాన ప్రతిఫలాలు అరకొరగా, భవిష్యత్‌కు భరోసా లేని విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సెమినార్‌లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి, ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు, నాయకులు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.