పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ పాలకులు కొనసాగిస్తున్న అమానుష హింసాకాండను నేడు ప్రపంచమంతా నివ్వెరపోయి చూస్తున్నది. అక్టో బర్7 హమాస్ దాడితో మొదలైన హింసా వలయంలో ఇప్పటివరకు 18వేల మందికి పైగా మరణించారు. ఇందులో సుమారు 1200 మంది ఇజ్రాయిలీలు, ఇందులో కొంతమంది విదేశీయులు కాగా.. గాజా ప్రాంతంలో 16 వేలకు పైగా పాల స్తీనియన్లు (అందులో అధికశాతం మహిళలు, పిల్లలు) మరణించారు. హమాస్ ఉనికి లేని వెస్ట్ బ్యాంక్‌లో 250 మంది పాలస్తీనియన్ పౌరులు ఇజ్రాయిల్ మిలిటరీ, సెటిలర్ల చేతుల్లో చంప బడ్డారు. ఖతార్ మధ్యవర్తిత్వంతో అమలులోకొ చ్చిన 7 రోజుల కాల్పుల విరమణ తర్వాత.. ఇజ్రా యిల్ సేనలు మరింత ఉధతంగా దాడులను కొన సాగిస్తున్నాయి. హమాస్ దాడి శూన్యంలో సంభ వించలేదని.. 56 ఏండ్లుగా పాలస్తీనా పై కొనసాగుతున్న ఇజ్రాయిల్ దురాక్ర మణే అసలు కారణమని తేల్చి చెప్పిన ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటరస్ వ్యాఖ్యలు.. అసలు పాపం ఎవరిదో తేల్చి చెబుతున్నాయి.
ఇజ్రాయిల్ – పాలస్తీనా సంఘర్ష ణని నేటి కాలపు వ్యాఖ్యాతలు చాలా మంది.. మతాల మధ్య గొడవగా చిత్రీ కరిస్తున్నారు. అబ్రహమైట్ తెగకు చెం దిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య జాతి వైరంగా సైతం కొందరు వ్యాఖ్యానిస్తు న్నారు. అయితే.. చరిత్రను సరిగ్గా అవలోకించి చూస్తే మతం రగడ ఇందులో పెద్దగా ఏమీ లేద న్నది సుస్పష్టం. సామ్రాజ్యవాద శక్తులు తమ స్వార్ధ ప్రయోజనాల రక్షణ కోసం పన్నిన కుతంత్రమే ఇజ్రాయిల్ రాజ్య ఏర్పాటు. అదే పాలస్తీనియను లపై కొనసాగుతున్న దమనకాండకు మూల కార ణమై నిలిచింది. గత ఏడు దశాబ్దాల కాలంలో లక్ష లాది మంది పాలస్తీనియన్లు మాతభూమిని వదిలి పరాయిగడ్డపై కాందిశీకులయ్యారు. వేలాదిమంది చంపబడ్డారు. మొదట్లో బ్రిటన్.. తర్వాత సామ్రాజ్యవాద శిబిరానికి రెండో కష్ణుడిగా తెరపైకొచ్చిన అమెరికా దేశాలు పన్నిన కుతం త్రంలో పాలస్తీనియనులు సమిధ లుగా మారారు.
పాలస్తీనా ప్రాంతం 1900 లలో ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ముస్లింలు, క్రైస్త వులు, యూదులు గొడవలు లేకుం డా సామరస్యంగా జీవించేవారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి, ఒట్టోమన్ సామ్రా జ్యం కూలిపోయి.. పాలస్తీనా బ్రి టిష్ పాలనలోకి వచ్చింది. ప్రపం చంలోని యూదులందరికీ ఒక ప్రత్యేక దేశం ఉం డాలనే ఆకాంక్షతో.. జియోనిస్ట్ ఉద్యమాన్ని 1896 లో థియోడర్ హెర్జల్ అనే ఆస్ట్రియన్ జర్నలిస్టు మొదలుపెట్టాడు. మొదటి నుండి వడ్డీ వ్యాపారం లో రాటుతేలిన కారణాన.. బ్రిటన్‌లోని యూదులు ఆ రోజుల్లో ఆ దేశ బ్యాంకింగ్ వ్యవస్థపై పట్టు సాధించారు. దీంతో యూదుల లాబీయింగ్‌కు బ్రి టిష్ పాలకవర్గాలు తలొగ్గాల్సి వచ్చేది. యూదు దేశ ఏర్పాటుకు అంగీకరిం చిన బ్రిటిష్ పాలకులు.. తమ వలసపాలనలో ఉన్న ఉగాండా లేదా కెన్యా లో తమ దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని యూదు ప్రతినిధుల ముందు ప్రతిపాదించారు. చర్చలు పలు విధాలుగా సాగి.. చివరకు పాలస్తీనా ప్రాం తంలోనే తమ దేశం ఏర్పాటు కావాలని యూదు నాయకులు పట్టుబట్టారు. పాలస్తీనాలో తమ మతానికి సంబంధించిన చారిత్రక ప్రదేశాలు ఉన్నాయనేది వారి ప్రధాన వాదన. పాలస్తీనా అనేది తమ పూర్వీకుల నివాసమని, తమకు దైవదత్తమైన ప్రాంతము (ప్రామిస్డ్ లాండ్ ) అంటూ సైతం వారు వాదించారు.
1917లో బాల్ఫోర్ డిక్లరేషన్ ద్వారా పాలస్తీ నాలో యూదు రాజ్య ఏర్పాటుకు బ్రిటన్ తన సమ్మ తిని ప్రకటించింది. మరోవైపు.. ఒట్టోమన్లతో జరు గుతున్న యుద్ధంలో స్థానిక అరబ్ ప్రజల మద్దతు అవసరం కాబట్టి.. యుద్ధంలో సహకరిస్తే ఒట్టో మన్ సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత ఆయా ప్రాంతాల్లో స్వతంత్ర అరబ్ దేశాల ఏర్పాటుకు సహ కరిస్తామని అరబ్బులకూ ఆశ చూపెట్టారు. ఎవరికి ఎలాంటి ఆశలు చూపినా.. అంతిమంగా తమ సామ్రాజ్యవాద ఆకాంక్షలే పరమావధిగా బ్రి టన్ పావులు కదిపింది. 1920 దశకం ఆరంభ మయ్యే నాటికి.. సూర్యుడు అస్తమించని సామ్రా జ్యం కాస్తా.. పతనం కావడం ప్రారంభమైంది. 1922లో ఈజిప్టు స్వతంత్రమైంది. తమ దురాశ చావని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు.. ఈజిప్టు దేశం పై ఆధిపత్యం వదులుకున్నా, ఆ దేశపు కీలక ఆదా య వనరుగా ఉన్న సూయజ్ కాలువపై మాత్రం తమ కబ్జా కొనసాగించారు. ఇక పాలస్తీనాతో సహా ఇతర ప్రాంతాలు సైతం తమ చేతుల్లోనుంచి జారిపోనున్నాయ ని వారికి అర్థమైంది. సూయజ్ కాలువతో పాటు.. మధ్య ప్రాచ్యంలోని ఆయిల్ సంపదపై తమ పట్టు కొనసాగాలంటే.. ఆ ప్రాంతంలో తమ బంటు దేశం ఒకటి ఉండాలనే దుష్టతలంపే ఇజ్రాయిల్ రాజ్య ఏర్పా టుకు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పూనుకునేట్టు చేసింది.
బాల్ఫోర్ ప్రకటనతో ఆయా దేశా ల నుండి యూదులు పెద్దఎత్తున పాలస్తీనాకు వలస రావడం మొద లైంది. 1900 నాటికి పాలస్తీనాలో యూదుల జనాభా కేవలం 6 శాతం కాగా.. 1931 నాటికి 17 శాతానికి, 1947 నాటికి 32 శాతానికి చేరుకు న్నది. హిట్లర్ జర్మనీలో నెరపిన ‘హోలోకాస్టు’ దారుణాల బాధితులు గా ప్రపంచ ప్రజలు యూదుల పట్ల సానుభూతి చూపుతుంటారు. హిట్లర్ దౌర్జన్యాల నుండి తప్పిం చుకోవడానికే యూదులు పాలస్తీనా వలసబాట పట్టారని చాలామంది అమాయకంగా నమ్ముతుం టారు. హిట్లర్ జర్మనీలో అధికారంలోకి వచ్చింది 1933లో. చరిత్ర క్రమం పరిశీలిస్తే ఆ ఘట్టం రావడానికి చాలా ఏండ్లకు ముందే బాల్పోర్ ప్రక టన, పాలస్తీనాలోకి యూదుల వలసలు చోటు చేసుకున్నాయన్న వాస్తవం అర్థమవుతుంది. యూ దుల వలసలు పెరగడంతో స్థా నిక అరబ్బులకు యూదులకూ మధ్యన ఘర్షణలు మొదలయ్యాయి. నవంబర్ 29, 1947న పాలస్తీనా విభజన తీర్మా నాన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. బ్రిటన్ వైదొలిగాక.. పాలస్తీనా ప్రాంతాన్ని రెండు దేశాలు గా విభజించాలని తీర్మానిస్తూ.. 32 శాతం జనాభా ఉన్న యూదులకు 56శాతం ప్రాంతాన్ని అప్ప గిస్తూ, మిగతా ప్రాంతాన్ని పాలస్తీనాగా ప్రకటించి, జెరూసలం నగరాన్ని అంతర్జాతీయ ఆజమాయిషీ లోని ప్రాంతంగా ప్రకటించారు. ఆ తీర్మానాన్ని పాలస్తీనియనులు వ్యతిరేకించారు. 15 మే 1948 న సమస్యను తేల్చకుండానే బ్రిటన్ పాలస్తీనా నుండి వైదొలగడం.. అదే రోజున ఇజ్రాయిల్ రాజ్య ఏర్పాటును యూదు అసెంబ్లీ ప్రకటించు కోవడం జరిగాయి.
అదే రోజున జియోనిస్ట్ ముఠాలు పాలస్తీనా గ్రామాలపై దాడి చేసి 7,50,000 మంది పాలస్తీ నియన్లను వారి ఇళ్ల నుండి బహిష్కరించి, వారి భూమిని స్వాధీనం చేసుకుని, వారిని శరణార్థు లుగా మార్చాయి. దాంతో మొదటి అరబ్ ఇజ్రా యిలీ యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత 1967, 73లలో సైతం అరబ్ ఇజ్రాయిల్ యుద్ధాలు సాగినవి. బ్రిటన్ స్థానంలో సామ్రాజ్యవాద శిబిరా నికి నాయకుడిగా అవతరించిన అమెరికా అండ దండలతో ఇజ్రాయిల్ అన్ని యుద్ధాలలోనూ గెలి చింది. ఐరాస తీర్మానాన్ని బుట్టదాఖలా చేస్తూ జెరూసలం నగరం మొత్తాన్ని తన స్వాధీనంలోకి తీసుకుని దేశ రాజధానిగా ప్రకటించుకున్నది. పాలస్తీనా ప్రాంతాలన్నింటినీ ఆక్రమించుకుని అక్కడ యూదుల కాలనీలను ఏర్పాటు చేస్తున్నది. వలస వచ్చిన వారికి సురక్షిత దేశం అవతరిం చగా.. భూమి పుత్రులు నిలువ నీడను కోల్పోయి, స్వదేశంలోనే కాందిశీకులైన దుస్థితి నేడు ‘పాల స్తీనా విషాదం’గా నిలిచి ఉన్నది!
తమ ఉనికికి కారకులైన సామ్రాజ్యవాదుల పట్ల ఇజ్రాయిల్ జియోనిస్టు పాలకులు అనునిత్యం గులాములుగా వ్యవహరించారు. 1956లో ఈ జిప్టు అధ్యక్షుడు అబ్దుల్ గమాల్ నాజర్ సూయజ్ కాలువపై బ్రిటిష్ ఆధిపత్యాన్ని రద్దు చేస్తూ దాన్ని తమ దేశపు ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించాడు. బ్రిటిష్ వాడికి బంటుగా వ్యవహరిస్తున్న ఇజ్రాయిల్ తన యజమాని తరఫున ఈజిప్టు పై యుద్ధానికి దిగింది. ఈ జిప్టు తరఫున సోషలిస్ట్ సోవి యట్ యూనియన్ రంగం లోకి దిగడంతో సామ్రాజ్యవా దుల పాచికలు విఫలమ య్యాయి. దక్షిణాఫ్రికాపై శ్వేత జాతి దురహంకార పాలన సాగుతున్నప్పుడు ఆ దేశ పాల కులకు వ్యతిరేకంగా ఐక్య రాజ్యసమితిలో తీర్మానం వెలు వడినప్పుడల్లా వ్యతిరేకించడం లో అమెరికాతో పాటు ఇజ్రా యిల్ ఎప్పుడూ ముందుండేది.
1993లో పాలస్తీనియ నులకు ఇజ్రాయిల్‌కు మధ్య కుదిరిన ఓస్లో ఒప్పందం సైతం శాంతిని చేకూర్చలేక పోయింది. పాలస్తీనా ప్రాంతాల్లో యూదు కాలనీల ఏర్పాటు నుండి ఇజ్రాయిల్ వైదొలగక పోవడమే అందుకు కారణమైంది. సెక్యులర్ భావజా లానికి కట్టుబడి ఉన్న పాలస్తీనా విమోచన సంస్థ (పీఎల్‌ఓ) అవలంబిస్తున్న మెతక వైఖరియే.. ఇజ్రాయిల్ దౌర్జన్యాలకు కారణంగా భావించిన పాలస్తీని యనులు.. క్రమక్రమంగా మత భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. పర్యవసానంగా జిహాద్ పంథాను అవలంబించే ‘హమాస్’ పాలస్తీనియ నుల ప్రతినిధిగా అవతరించింది.
1945లో ఆవిర్భవించిన ఐక్యరాజ్యసమితికి నివేదించబడిన మొట్టమొదటి సమస్య.. పాలస్తీనా సమస్యనే. నేటికీ అది అపరిష్కతంగానే మిగిలి ఉన్నది. పాలస్తీనా భూభాగాల నుండి ఇజ్రాయిల్ వైదొలగాలని, అక్రమ సెటిల్మెంట్లను తొలగించా లని.. ఐక్యరాజ్యసమితి గత 70 ఏండ్లుగా పదుల సంఖ్యలో తీర్మానాలు చేసింది. అమెరికా అండతో ఇజ్రాయిల్ వాటన్నిటినీ పూర్వపక్షం చేయగలి గింది. ఇజ్రాయిల్ దౌర్జన్యాలకు అడ్డుకట్ట పడాలని, 1948 నాటి సరిహద్దులతో స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు కావాలని, ఇకనైనా పాలస్తీనా విషాదానికి ముగింపు పలకాలని అంతర్జాతీయ సమాజము నేడు దఢంగా కోరుకుంటున్నది. మొన్నటి అక్టో బర్ 7న హమాస్ చేసింది నిస్సందేహంగా టెర్ర రిస్ట్ చర్యనే. అయితే ఇజ్రాయిల్ గత 75ఏండ్లుగా టెర్రరిజాన్నే తన రాజ్య విధానంగా పాలస్తీనా ప్రజ లపై ప్రయోగిస్తున్నది. తాజాగా చెలరేగిన హింసా చర్యల పరంపరకు మూల కారణం ఇజ్రాయిల్ టెర్రరిజమే. ఇజ్రాయిల్ పాలకుల దురహంకారా నికి, అమెరికా సామ్రాజ్యవాదుల తెంపరితనానికీ అడ్డుకట్ట పడాలంటే విశ్వ మానవాళి అభిప్రాయ మూ, మద్దతూ మరింత గట్టిగా.. దగాపడిన పాలస్తీనా పక్షాన వినిపించాల్సిన అవసరం నేడు న్నది. మహాకవి శ్రీశ్రీ అభిలషించినట్టుగా.. దారుణ ద్వేషాగ్ని పెంచే దానవత్వం నశించాలని, నడుమ తడబడి కడలి మునగక శాంతినావ తీరం చేరాలనీ ఆశిద్దాము.
ఆర్. రాజేశమ్ 9440443183