ఆశాలపై పోలీసుల దాష్టీకం అడ్డుకున్న పోలీసులు

Police attack on hope
Stopped by the police– తోపులాటలు.. తీవ్ర ఉద్రిక్తత
– పలువురికి గాయాలు.. సొమ్మసిల్లిన ఆశాలు
– అరెస్టు చేసి స్లేషన్లకు తరలింపు
– ఖమ్మంలో పేర్లు, సంతకాలు పెట్టాలంటూ పోలీసుల ఒత్తిడి
– పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతులు
నవతెలంగాణ- విలేకరులు
ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18,000 ఇవ్వాలని కోరుతూ తెలంగాణ వాలంటీర్‌ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన మంత్రుల నివాసాలు, కార్యాలయాల ముట్టడి ఉద్రిక్తంగా మారింది. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఆశాలను పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. తోపులాటతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మహిళలని కూడా చూడకుండా పోలీసులు లాగిపడేశారు. ఈ క్రమంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు.
మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు మెమోరాండం ఇచ్చేందుకు హైదరాబాద్‌ మారేడ్‌పల్లిలోని ఆయన ఇంటికి వెళ్తున్న సీఐటీయూ నాయకత్వాన్ని, ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులకు, ఆశావర్కర్లకు మధ్య జరిగిన తోపులాటలో ఇద్దరు ఆశావర్కర్లు సొమ్మసిల్లి పడిపోయారు. ఆరుగురికి తీవ్ర గాయాలై రక్తం కారింది. పోలీసులు మొత్తం 78 మందిని అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో సీఐటీయూ నగర కార్యదర్శి ఎం.వెంకటేష్‌, సహాయ కార్యదర్శులు టి.మహేందర్‌, ఎం. సత్య నారాయణ, తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నగర కార్యదర్శి ఎం అనిత, ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, లక్ష్మి తదితరులు ఉన్నారు.
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావుకు వినతిపత్రం అందజేశారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ ఇంటి ముందు ఆశ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరిం చాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో సీఐటీయూ నాయకులు, ఆశాలను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆశా కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌ గేటు ఎదుట ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న వారితో పోలీసులు చర్చలు జరిపారు. సుమారు రెండు గంటల తర్వాత విడుదల చేశారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ ఇంటి ఎదుట ఆశావర్కర్లు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ క్రమంలో పోలీసులు సీఐటీయూ నాయకులతో పాటు ఆశావర్కర్లను అరెస్టు చేశారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆశావర్కర్లు ఆందోళన చేపట్టి.. కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.
ఖమ్మంలోని మంత్రి పువ్వాడ అజరు కుమార్‌ క్యాంప్‌ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన ఆశాలను పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేశారు. ఖమ్మం టూ టౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలిచారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు విష్ణును బలవంతంగా ఎత్తుకెళ్లి పోలీసు వ్యాన్‌లో పడేశారు. అరెస్టు అయిన ఆశాలందరూ పేర్లు, సంతకాలు పెట్టాలని పోలీసు అధికారులు ఒత్తిడి చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యుల సంతకాలు పెడతామన్నా పోలీసులు ఒప్పుకోక పోవడంతో స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. ఆశావర్కర్లకు ఫిక్స్‌ డ్‌ వేతనం రూ.18000 ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరారు. వైరాలో ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వినతి పత్రాన్ని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో అందజేశారు. మధిరలో ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ర్యాలీగా మధిరలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకొని మానవహారం చేపట్టారు. కూసుమంచి మండల కేంద్రంలోని నుంచి పాలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ఆశాలు ర్యాలీ వచ్చి ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే పీఆర్‌ఓకు వినతిపత్రాన్ని అందజేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంటి ముందు ధర్నా చేశారు. ఎమ్మెల్యే లేక పోవడంతో ఇంటికి వినతిపత్రాన్ని అతికించారు. భద్రాచలంలో ఆశా వర్కర్స్‌ సమస్యలపై ఎమ్మెల్యే పొదెం వీరయ్యకి మెమోరండం అందజేశారు. మణుగూరు ప్రధాన సెంటర్‌ నుంచి ఆశాలు ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం వద్దకు చేరుకొని ముట్టడించారు. ఎమ్మెల్యే రేగాకు వినతిపత్రం అందజేశారు.
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్‌ గువ్వల బాలరాజ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు కల్వకుర్తి టౌన్‌ పట్టణంలో, నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు.
ములుగు జిల్లా డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అల్లం అప్పయ్యకు వినతిపత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే సీతక్కకు వినతిపత్రం అందజేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి వినతిపత్రం అందించారు. హనుమకొండలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం వారిని అరెస్టు చేశారు. అంతకు ముందు భారీ ర్యాలీ తీశారు.