రెజ్లర్ల విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి

తెలంగాణ రెడ్కో చైర్మెన్‌ వై సతీష్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రెజ్లర్లు ఇప్పటి వరకు తాము సాధించిన పతకాలను గంగానదిలో నిమజ్జనం చేస్తామని ప్రకటించడంపై తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివద్ధి సంస్థ (రెడ్కో) చైర్మెన్‌ వై సతీష్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మోడీ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుతో విసిగిపోయి తాము బతికి ఉండటమే వృథా అంటూ క్రీడాకారులు విడుదల చేసిన ప్రకటన చాలా బాధాకరమన్నారు. క్రీడాకారులు ఎంత ఆత్మక్షోభకు గురై ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో దేశ ప్రజలకు అర్థమవుతున్నది కానీ, ప్రధాని నరేంద్రమోడీకి అర్థం కావట్లేదని విమర్శించారు. ఐదు నెలలుగా ఢిల్లీలో ధర్నా చేస్తున్నా పట్టించుకోకపోవడం ప్రధాని మోడీ నియంతృత్వ పోకడకు నిదర్శనమన్నారు. దీనిపై తక్షణం రాష్ట్రపతి జోక్యం చేసుకుని, దేశ ప్రతిష్టను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. రెజ్లర్లపై లైంగికవేధింపులకు పాల్పడిన బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణం అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. జాతీయ మహిళా కమిషన్‌ ఈ విషయంపై మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుపట్టారు.