– ఫెడరేషన్‌కు మంత్రి మహేందర్‌రెడ్డి హామీ
– ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా జీవో
– జారీచేయాలని టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుపోతానని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షుడు పులిపలుపుల ఆనందం తదితరులు మంగళవారం రాష్ట్ర సమాచార శాఖ మంత్రిని జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయమై దాదాపు గంటపాటు చర్చించారు. గత ప్రభుత్వాలు, ఎప్పుడెప్పుడు స్థలాలు ఇచ్చాయి, ఎంత మందికి ఇచ్చాయి, ఇంకా ఎంతమందికి ఇవ్వాల్సి ఉంది తదితర అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా ఫెడరేషన్ నాయకత్వం పూర్తి వివరాలతో కూడిన వినతిపత్రం సమర్పించింది. ఇండ్ల స్థలాల కోసం వేలాది మంది జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్నారని నాయకులు గుర్తు చేశారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతర, గత తొమ్మిదేండ్లుగా ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేయడమే కాకుండా, తాము సదస్సులు, సమావేశాలు, ధర్నాలు కూడా చేయడం జరిగిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు ఇండ్ల స్థలాల విషయమై స్పందన లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తున్నారనీ, అందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలకు కతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు పలు పట్టణాలు, నగరాల్లో పని చేస్తున్న వేలాదిమంది జర్నలిస్టులకు మాత్రం ఇండ్లస్థలాలు ఇచ్చే ప్రక్రియ జరగడం లేదన్నారు. దీంతో జర్నలిస్టులంతా తీవ్ర నిరాశతో ఉన్నారని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు సైతం తీర్పు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీలో హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. జర్న్లలిస్టుల ఆవేదనను అర్థం చేసుకుని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా ఇండ్లస్థలాలు కేటాయిస్తూ జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి కేటాయించిన స్థలాన్ని ఆ సొసైటీకి, అదేవిధంగా జూబ్లీహిల్స్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ పరిధిలో గోపనపల్లిలో ఉన్న తొమ్మిదెకరాల భూమిని ఆ సొసైటీకి అప్పగించాలని వారు మంత్రిని కోరారు. అలాగే దక్కన్, తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్ హౌసింగ్ సొసైటీలకు కూడా భూమి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, అన్ని ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో హెల్త్ కార్డులు పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కె. పాండురంగారావు, జే. ఉదయభాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.