గ్రామాలలో నెలకొన్న సమస్యలు ప్రభుత్వము తక్షణం పరిష్కరించాలి

నవతెలంగాణ_బొమ్మలరామారం
గ్రామపంచాయతీలలో కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనలలో సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నాయని, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి తగిన నిధులు కేటాయించి గ్రామాల్లో ఉన్న మౌలిక సమస్యలను పరిష్కారం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని మర్యాల గ్రామంలో జలాల్ పూర్, బోయిన్పల్లి, రంగాపురం, తూముకుంట,కంచల్ తండా, గోవింద్ తండా, నాగినేనిపల్లి, మేడిపల్లి, గ్రామాలలో సీపీఐ(ఎం) పోరుబాట కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం  గ్రామకార్యదర్శి రామాంజనేయ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా దాసరి పాండుమాట్లాడుతూ.. గత ఫిబ్రవరి నుండి సర్పంచ్ పాలన ముగిసి ప్రత్యేక అధికారుల పాలన వచ్చిన తర్వాత గ్రామాలలో సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎవరిని అడగాలను అర్థం కాని పరిస్థితులలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామాలలో రోజురోజుకు మురికి కాలువలు, వీధిలైట్లు, మంచినీళ్ల సమస్యలు పెరుగుతున్నాయని వాటిని తక్షణం పరిష్కారం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. గ్రామంలో లింక్ రోడ్ల సమస్య చాలా పెద్ద ఎత్తున ఉన్నదని సమస్యలను పరిష్కారం చేయాలి, అక్కడక్కడ దెబ్బతిన్న బీటీ రోడ్లను తక్షణం బాగు చేయాలని అన్నారు. వర్షకాలంతో దోమల బెడద పెరిగి ప్రజలు వివిధ రోగాల బారిన పడుతున్నారని గ్రామాలలో తరచుగా గడ్డి మందు, దోమల నివారణ మందు పిచికారి చేయాలని ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యకలశ్రీశైలం గ్రామ శాఖ కార్యదర్శి ముద్దమదు ప్యారారం వెంకటేష్ సంగి బాలయ్య దేవేందర్ సంగి శంకరయ్య సిపతి రామయ్య నల్లగొండ వెంకటయ్య పొట్ట భాస్కర్ దేశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.