అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి

– యూనియన్ మండల అధ్యక్షురాలు స్వరూప

నవతెలంగాణ పెద్దవంగర: అంగన్వాడీ ఉద్యోగులకు రూ. 26 వేలు కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత వంటి సౌకర్యాలు కల్పించాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు స్వరూప డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. తహశీల్దార్ వీరగంటి మహేందర్ కు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ టీచర్లకు వెంటనే గ్రాట్యుటీని చెల్లించాలని, 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం సమ్మె నోటీసులు తహశీల్దార్ కు అందజేశారు. కార్యక్రమంలో యాకలక్ష్మీ, మంజుల, మమత, యాదమ్మ, కనకదుర్గ, యామిని తదితరులు పాల్గొన్నారు.