నవతెలంగాణ-నస్పూర్
అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని శనివారం కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భానుమతి, రాజమణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 65 సంవత్సరాలు పూర్తయిన అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ సుమారు 10 వేల మంది పనిచేస్తున్నారని అన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని గత సంవత్సరం సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 4 వరకు రాష్ట్రంలో 24 రోజులు అంగన్‌వాడీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేశామన్నారు. ఈ సమ్మె సందర్భంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్స్‌కు రూ.2 లక్షలు, హెల్పర్స్క రూ.1 లక్ష పెంచుతామని, పెన్షన్, వీఆర్‌ఎస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అనంతరం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్‌వాడీ ఉద్యోగుల స్థితిగతులు, గత 24 రోజులు సమ్మె జరిగిన పరిస్థితి, ఆ సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, హామీల్లో ఒక్కటైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి కూడా వివరంగా ప్రభుత్వం ఐసీడీఎస్ మంత్రి, ఐసీడీఎస్ రాష్ట్ర అధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకువచ్చామన్నారు. కానీ వాటిని పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయమని, పైగా రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ మనోభావాలకు వ్యతిరేకంగా, ఏకపక్షంగా అతి తక్కువ డబ్బులు చెల్లించి, అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్సు జూలై 1 నుండి ఇంటికి పంపించాలని నిర్ణయం చేయడం అత్యంత దుర్మార్గంమని వాపోయారు. అంగన్వాడీ ఉద్యోగులకు తీవ్రమైన నష్టం కలిగించే ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ అంగన్‌వాడీ ఉద్యోగుల పట్ల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం సరైంది కాదని, గత కొన్ని సంవత్సరాలుగా ఐసిడిఎస్ వ్యవస్థను కాపాడే అంగన్‌వాడీ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చేటువంటి గుర్తింపు ఇదేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో విరోనిక, అనురాధ, రాజేశ్వరి, సరిత, శారదా, ప్రవీణ, పద్మావతి, రాణి, ఇందిరా, శిరీష పాల్గొన్నారు.