కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల సమస్యలను పరిష్కరించాలి

The problems of contract ANMs should be resolved– వారి సేవలను క్రమబద్ధీకరించాలి : ఏఎన్‌ఎంల కమిటీకి టీయుఎంహెచ్‌ఇయూ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల సమస్యలను పరిష్కరించాలి. వారి సేవలను క్రమబద్ధీకరించాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీయుఎంహెచ్‌ఇయూ-సీఐటీయూ అనుబంధం) కోరింది. ఈ మేరకు యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్‌, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ ఫసియొద్దీన్‌, కె.యాదానాయక్‌, రాష్ట్ర కోశాధికారి ఎ.కవిత తదితరులు ఏఎన్‌ఎంల సమస్యలపై వేసిన ఉన్నతాధికారుల కమిటీ చైర్‌ పర్సన్‌ హైమావతి, సభ్యులు డాక్టర్‌ కె.రమేశ్‌ రెడ్డిలకు వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను యధావిధిగా రెగ్యులర్‌ చేయాలనీ, పరీక్ష కోసం వేసిన నోటిఫికేషన్‌ రద్దు చేయాలనే డిమాండ్లతో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు జరిగిన సమ్మె కాలంలో రెండు సార్లు చర్చలు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. సెప్టెంబర్‌ ఒకటిన చర్చల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ముగ్గురితో కమిటీ వేశారనీ, దీనితో న్యాయం జరుగుతుందనే ఆశతో సెప్టెంబర్‌ 4న సమ్మె విరమించినట్టు చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో 2003 నుంచి దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల సర్వీసును కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలు పూర్తి చేసుకున్నారని తెలిపారు. మెరిట్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, రాతపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా డిస్ట్రిక్ట్‌ సెలెక్ట్‌ కమిటీ ద్వారా నియమితులైన వారిలో అత్యధిక మంది వయోపరిమితి దాటిపోయిందని తెలిపారు. రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగా జాబ్‌చార్ట్‌తో పని చేస్తున్నారని తెలిపారు. వీరిలో 2వ ఏఎన్‌ఎంలు 3,958 మంది, ఈసీ ఏఎన్‌ఎంలు 644, ఎన్‌వీహెచ్‌ఎం 841, ఆర్‌బీఎస్‌ఎల్‌ 269, అవుట్‌సోర్సింగ్‌ ద్వారా 1,083, హెచ్‌ఆర్‌ డీ 47, 104 ఏఎన్‌ఎంలు 20 మంది పని చేస్తున్నారని తెలిపారు.
పీఆర్సీ ప్రకారం ఎంపీహెచ్‌ఏ (ఎఫ్‌) క్యాడర్‌ బేసిక్‌ రూ.31,040లుగా నిర్ణయించినప్పటికీ కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎం లకు ఇవ్వకుండా రూ.27 వేలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. బేసిక్‌తో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు ఇవ్వాలని కోరారు. కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలందరి కి ఒకే రకమైన వేతనం ఇవ్వాలని సూచించారు.
కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలకు రాత పరీక్షను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు 30 మార్కుల వెయిటేజీ ఇచ్చినప్పటికీ రెగ్యులర్‌ కావడానికి అవకాశం లేదని తెలిపారు. 6 వేల మంది ఉద్యోగులుంటే పోస్టులు 1,931 మాత్రమే ఇచ్చారని తెలిపారు. కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలకు వయోపరిమితి ఎత్తివేయాలని కోరారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల ఏఎన్‌ఎంలకు పూర్తి సర్వీసుకు డీఎంహెచ్‌ఓల ద్వారా సర్వీస్‌ సర్టిఫికెట్లు, అపాయింట్‌ మెంట్‌ ఆర్డర్‌ కాపీలివ్వాలని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తు, రాత పరీక్ష తేదీలను పొడిగించాలని కోరారు.
”ఏఎన్‌ఎంలకు యువిన్‌, ఎన్‌సీడీ పనులను రద్దు చేయాలి. హైదరాబాద్‌ నగరంలో 5 వేల జనాభాకు ఒక ఏఎన్‌ఎంను నియమించాలి. పని వేళల్లో మాత్రమే జూమ్‌ మీటింగ్‌ నిర్వహించాలి. మిగతా సమావేశాలు సైతం పని వేళల్లో మాత్రమే జరపాలి. సాయంత్రం 4 గంటల తర్వాత ఎలాంటి సమావేశాలు పెట్టరాదు. పై అధికారులు ఫోన్లు చేయరాదు. ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రుల్లో టెలిమనాస్‌ కార్యక్రమం నుంచి ఏఎన్‌ఎంలను మినహాయించాలి. ఆరోగ్య మహిళా కార్యక్రమానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. తక్కువ జీతాలు వస్తున్న 47 మంది హెచ్‌ఆర్డీ ఏఎన్‌ఎంలు, 104 ఏఎన్‌ఎంలను ఎన్‌హెచ్‌ఎంలో కలపాలి. ఈసీ ఏఎన్‌ఎంలకు ఐడీ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలి. ఈసీ ఏఎన్‌ఎంలకు ప్రతి నెలా మొదటి వారంలో జీతాలివ్వాలి. కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలకు పీఆర్సీ ఎరియర్స్‌ వెంటనే చెల్లించాలి. కొత్త జిల్లాల్లోని స్థానికత ఆధారంగా బదిలీలకు అవకాశం కల్పించాలి. వ్యాక్సిన్‌ అలవెన్స్‌ రూ.500, యూనిఫాం అలవెన్స్‌ రూ.2,500 ఇవ్వాలి. 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు, మెడికల్‌ లీవులివ్వాలి. నైట్‌, ఓపీ డ్యూటీలు రద్దు చేయాలి. విధి నిర్వహణలో చనిపోయిన వారికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. హెల్త్‌ కార్డుల జారీ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ఫీల్డ్‌ డ్యూటీ చేస్తున్నందున ఎఫ్టీఏ సౌకర్యం కల్పించాలి. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌ నియమించాలి….” అని ఉన్నతాధికారుల కమిటీకి యూనియన్‌ ప్రతిపాదనలు సమర్పించింది.