ప్రభుత్వ రంగ సంస్థల్లోని కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. ఎంపీ భత్రుహరి మతాబ్‌ సారథ్యంలో 31 మంది ఎంపీల బృందం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యల అధ్యయనం కోసం లేబర్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పార్లమెంటరీ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తున్నది. మంగళవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో కార్మిక సంఘాలతో సమావేశమైంది. ప్రభుత్వరంగ సంస్థల యాజమాన్యాలు కార్మిక సంఘాలకు సమాచారం ఇవ్వకుండా తమకు అనుకూలంగా ఉండే కొన్ని కార్మిక సంఘాల నాయకులతో తమకు అనుకూలంగా ఉన్న వారిని హాజరు పర్చడాన్ని సీఐటీయూ తప్పుబట్టింది. కార్మికుల సంక్షేమం విషయంలో అన్ని యాజమాన్యాలు బాగా పని చేస్తున్నాయని చెప్పించేందుకు ప్రయత్నించటం దుర్మార్గమని పేర్కొంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో స్టాండింగ్‌ కమిటీ అనివార్యంగా అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులతోనూ సమావేశాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఎం. సాయిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, రాష్ట్ర కార్యదర్శులు కె. వెంకటేష్‌, బి. మధు, ఎం. వెంకటేష్‌, రైల్వే కో-ఆర్డినేషన్‌ కమిటీ జాతీయ కన్వీనర్‌ ఎస్‌. రమేష్‌, ఎన్‌టీపీసీ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ నాయకులు లక్ష్మారెడ్డి, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే, బీపీసీఎల్‌, సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మిక సంఘాల నాయకులు జి. శ్రీనివాస్‌, గణేష్‌, పాండు, శ్యామ్‌, అరవింద్‌, కుమారిలతో కూడిన సీఐటీయూ బృందం స్టాండింగ్‌ కమిటీతో సమావేశమైంది. ఎన్‌హెచ్‌ఏఐ, ఈఎస్‌ఐ కార్పొరేషన్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, ఎన్టీపీసీ, పవర గ్రిడ్‌, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే, సింగరేణి, బీపీసీఎల్‌, గెయిల్‌, ఎన్‌ఎమ్‌డీసీ, తదితర ప్రభుత్వరంగ సంస్థల్లోని కాంట్రాక్టు కార్మికుల సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్లింది.అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో ఫెయిర్‌ వేజెస్‌ నిర్ణయించే విధంగా ప్రభుత్వరంగ సంస్థల యాజమాన్యాలను ఆదేశించాలని కోరింది. కమిటీకి వినతిపత్రం అందజేసింది.