– ఓట్లను బహిష్కరిస్తున్నామని బాబానగర్ వాసుల ప్రకటన
నవతెలంగాణ- జహీరాబాద్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం రంజోల్‌లో గల బాబానగర్‌లో నెలకొన్న సమస్యలను ఎవ్వరూ పరిష్కరించడం లేదు. దీంతో ఈ శాసనసభ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు స్థానికులు తీర్మానం చేశారు. గురువారం బాబానగర్‌వాసులంతా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. బయట నుంచి తమ గ్రామంలోకి ఏ పార్టీ నాయకులూ ప్రచారానికి రావొద్దని, తాము ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయబోమని భీష్మించుకూర్చు న్నారు. ఈ స్థానికులు నర్సింలు, రాజు, రవికుమార్, పద్మమ్మ, నరసమ్మ, చంద్రకళ, రవి తదితరులు మాట్లాడుతూ.. అధికారులు, పాలకుల లెక్కల్లో తమ బస్తీ లేకుండా పోయిందన్నారు. దీంతో ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని తెలిపారు. తమ గ్రామం ఏర్పడి దాదాపు 35 ఏండ్లకు పైగా గడుస్తోందని, ఇంత వరకు తమ ఓట్లు వేయించుకోవడమే గానీ, సమస్యలను ఒక్కటీ పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జహీరాబాద్ పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాబానగర్‌ను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరారు. రోడ్లు, మురికి కాల్వలను మరమ్మతు చేయాలన్నారు. రేషన్, వంటగ్యాస్, ఆసుపత్రి, పాఠశాలలకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని జహీరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోందన్నారు. వీటన్నింటినీ పరిష్కరించే వరకు ఓట్లు వేయబోమని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.