– కేంద్ర మంత్రికి సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం వినతి
న్యూఢిల్లీ : పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కారించాలని సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. మంగళవారం నాడిక్కడ పోలవరం నిర్వాసితుల సమస్యలపై కేంద్ర గిరిజన మంత్రి అర్జున్ ముండాను సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం అందజేసింది. మెమోరాండంలో పేర్కొన్న అంశాలను మంత్రికి వివరించింది. మంత్రిని కలిసిన వారిలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్, ఆర్.ఆరుణ్‌కుమార్, సీపీఐ(ఎం) అల్లూరి సీతారామారాజు జిల్లా కార్యదర్శి బి.కిరణ్, సీపీఐ(ఎం) ఏలూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి.నాగమణి, జిల్లా కమిటీ సభ్యులు డి. రమేష్, ప్రదీప్‌కుమార్ ఉన్నారు.
అనంతరం ఏపీ భవన్ వద్ద నేతలు మీడియాతో మాట్లాడారు. పోలవరం నిర్వాసితుల సమస్యల పట్ల కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, డిసెంబర్‌లో స్వయంగా ముంపు ప్రాంతాల పర్యటనకు మంత్రి హామీ ఇచ్చారని అన్నారు. పోలవరంలో ఆదివాసీ చట్టాలు అమలులో లోపాలున్నాయని మంత్రి అంగీకారించారని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణమంటే కాంట్రాక్టర్లకు, ధనికులకు డబ్బులు ఇవ్వడంగా తయారైందని, నిర్వాసితుల హక్కులు చట్టాలన్నీ పోలవరం ప్రాజెక్టు విషయంలో పూర్తిగా తుంగలో తొక్కారని పేర్కొన్నారు. అందుకు మంత్రి డిసెంబర్‌లో మంత్రే స్వయంగా పోలవరం ముంపు ప్రాంతాలలో పర్యటిస్తానని, ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి చట్టాలను అమలు జరపడానికి కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. లక్ష కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వకుండానే గిరిజనులను నీటిలో ముంచి ప్రాజెక్టు నిర్మాణం సాగుతుందని పేర్కొన్నారు. గతేడాది వరదల అనుభవాన్ని దృష్టిలోఉంచుకుని తప్పుడు కాంటూరు లెక్కలు పున:పరిశీలించాలని కోరారు. అలాగే 2013 భూసేకరణ చట్టం, అటవీ హక్కుల చట్టం, 5వ షెడ్యూలులో ఉన్న గిరిజన హక్కులు అమలు కావడం లేదనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ఉపాధి హామీ పథకం అమలు చేయడం లేదని, 2017 కటాఫ్ డేట్ పెట్టడంవల్ల 18 ఏండ్లు నిండినటువంటివారికి నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదని వివరించడంతో మంత్రి వెంటనే అధికారులను ఉపాధి హామీ, పోడు భూములపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి వీటిని పరిష్కారం చేయాలని ప్రతినిధి బృందం ముందే ఆదేశించారని తెలిపారు.