ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ఇందిరాపార్కు వద్ద ఎంప్లాయీస్‌ యూనియన్‌ సామూహికదీక్షల్లో నేతలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని పలువురు నేతలు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికులకు తీరని అన్యాయాలే చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు ఇలాంటి దుస్థితి వస్తుందని ఊహించలేదని ఆవేదన చెందారు. టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారంనాడిక్కడి ఇందిరాపార్కు వద్ద కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సామూహిక నిరాహారదీక్షలు చేశారు. యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ దీక్షల్ని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్‌ ప్రారంభించారు. పలు డిపోల నుంచి వచ్చిన ఆర్టీసీ కార్మికులు దీక్షల్లో కూర్చున్నారు. సీపీఐ రాష్ట్ర నాయకులు వీఎస్‌ బోస్‌, యూనియన్‌ అధ్యక్షులు ఎస్‌ బాబు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ముగింపు లోపు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే, భవిష్యత్‌ ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. యాజమాన్యం సీసీఎస్‌ బకాయిలు చెల్లించాలనీ, రెండు వేతన సవరణలు ఇవ్వాలనీ కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపకపోగా రాష్ట్ర ప్రభుత్వం వారి హక్కుల్ని కూడా పూర్తిగా హరించివేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థలో కార్మిక సంఘాల కార్యకలాపాలను రద్దు చేశారనీ, మూడు నెలల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశిస్తే, రాష్ట్రప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం, కార్మికశాఖ కమిషనర్‌ కార్యాలయాల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. సింగరేణి, టిఎస్‌ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామని ప్రభుత్వం భయపడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ సహా రాజ్యాంగ వ్యవస్థల్ని ఏమాత్రం గౌరవించట్లేదని విమర్శించారు. కార్మిక సంఘాలపై సర్కార్‌ ఎంత నిర్భంధం విధించినా, తాము పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామన్నారు. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు అనేక హామీలు ఇచ్చి, ఆ తర్వాత వాటి ఊసే ఎత్తట్లేదని ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కార్మికులపై యాజమాన్యం వేధింపులు ఎక్కువయ్యాయనీ, చిన్న తప్పిదాలకు కూడా సస్పెన్షన్‌, రిమూవల్స్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 వేతన సవరణకు సంబంధించిన బాండ్ల సొమ్మును ఇంతవరకు కార్మికులకు విడుదల చేయలేదని చెప్పారు. సాయంత్రం దీక్షల్ని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్‌ యూసుఫ్‌ విరమింపచేశారు. అనంతరం ప్రతినిధి బృందం కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి రాణి కుముదినికి ఆమె కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డీ గోపాల్‌, డీకే స్వామి, మంగ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.