పట్టు రైతుల సమస్యలు పరిష్కరించాలి

– కనీస ధర కట్టించాలి
– ప్రోత్సాహకం, సబ్సిడీ అందివ్వాలి
– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర
సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌
– తిరుమలగిరి పట్టుగూళ్ల డైరెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ-కంటోన్మెంట్‌
పట్టు రైతుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ పట్టు రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ తిరుమలగిరిలోని రాష్ట్ర పట్టుగూళ్ళ డైరెక్టర్‌ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా శోభన్‌ మాట్లాడుతూ.. పట్టు రైతులకు తిరుమలగిరి పట్టు మార్కెట్‌లో చాలా కాలంగా అన్యాయం జరుగుతోందన్నారు. మధ్యవర్తులు, అధికారులు సరైన ధర ఇవ్వకుండా రైతులకు నష్టం చేకూర్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి రైతులకు ప్రోత్సాహం, షేడ్‌ సబ్సిడీ, పని యంత్రాలు అందించాలని కోరారు. పట్టు రైతులకు మార్కెట్‌లో తగిన సదుపాయాలు కల్పించాలని, కనీస ధర నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. పట్టు రైతుల పట్ల మార్కెట్‌ అధికారులు వ్యవహరించే తీరు పూర్తిగా మారాలని కోరారు. పట్టుగూళ్లకు ఆంధ్ర, కర్నాటక మార్కెట్లతో సమానంగా తిరుమలగిరి, జనగామ మార్కెట్‌లలో ధర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే, పట్టుగూళ్లు అమ్మిన రోజే రైతు ఖాతాలో డబ్బులు జమ చేయాలని, జల్లిగూళ్ల నుంచి పట్టుగూళ్ల ధరలు 1/3 రేటు, డబుల్‌ గూళ్లకు 1/2 ధర ఇవ్వాలని అన్నారు. 2018 నుంచి రైతులకు రావాల్సిన ప్రోత్సాహక కమిషన్‌ రూ.75ను వెంటనే విడుదల చేయాలన్నారు. మినీట్రాక్టర్‌, ఇతర పట్టు వ్యవసాయ యంత్ర పరికరాలు, పట్టుపురుగుల రోగనిరోధకాలను 80 శాతం సబ్సిడీతో రైతులకు అందించాలని కోరారు. తెలంగాణ సెరికల్చర్‌ విభాగంలో ఉద్యోగ విరమణ పొందుతున్న శాస్త్రవేత్తలు, ఉద్యోగుల స్థానంలో కొత్త వారిని వెంటనే నియమించాలని డిమాండ్‌ చేశారు. అలాగే, రాష్ట్రంలో చాకి సెంటర్‌లను పెంచడం, పట్టుగూళ్ల డ్రయినేజీని వెంటనే ప్రారంభించాలని కోరారు. అనంతరం సహాయ కమిషనర్‌ సుధాకర్‌, మార్కెట్‌ అధికారి ఎం.శివకుమార్‌ను కలిసి వినతపత్రం అందజేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎస్‌.శ్రీధర్‌ రెడ్డి, మెరిండ్ల శ్రీనివాస్‌, పట్టు రైతులు ప్రవీణ్‌రెడ్డి, సక్రు అక్కిరం, అభిమన్య రెడ్డి, మండల రాజు, రఫిక్‌,రవీందర్‌, దేవిలల్‌, వినోద్‌, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.