రైతు ఉద్యమ హామీలను అమలు చేయాలి

– కేంద్రం మోసంపై రెండో దశ ఉద్యమం : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌
నవ తెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఢిల్లీలో రైతు ఉద్యమం సందర్భంగా రైతులకు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ డిమాండ్‌ చేశారు. వనపర్తి జిల్లా అమరచింత పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్‌ హాల్లో సోమవారం సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్‌ మాట్లాడుతూ.. డిసెంబర్‌ 9, 2021న ప్రధాన మంత్రి మోడీ లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలతో రైతులు ఉద్యమాన్ని విరమించారని చెప్పారు. అయితే, కనీస మద్దతు ధరల చట్టం, రైతు ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత వంటి హామీలను అమలు చేయక రైతులను మోడీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఈ మోసాన్ని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దేశ వ్యాప్తంగా రెండో దశ రైతు ఉద్యమం ప్రారంభించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా నిర్ణయించిందని చెప్పారు. కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం, రైతుల రుణ విముక్తి, కార్పొరేట్‌ కంపెనీలకు కాకుండా రైతులకు లాభం కలిగించే పంట బీమా పథకం, రైతు ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత అంశాలపై చర్చించామన్నారు. 2011 సాగుదారుల చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 11.5 లక్షల ఎకరాల్లో ఆదివాసీలకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ నుంచి నవంబరు వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి, రాష్ట్ర కన్వీనర్‌ వెంకటయ్య, జిల్లా నాయకులు బాల్‌ రెడ్డి, రాజన్న, రాబర్ట్‌, మేకల ఆంజనేయులు, ప్రసాద్‌, ఎస్‌ రాజు, అజరు, ఆర్‌ ఎన్‌ రమేష్‌, హనుమంతు, వెంకటయ్య, బుచ్చన్న, అనంతమ్మ తదితరులు పాల్గొన్నారు.