ఊరిస్తూ ఉసూరుమనిపిస్తూ..కురుస్తున్న వాన

– వారం రోజులుగా చల్లబడ్డ వాతావరణం
– చాలా మండలాల్లో పడని చుక్క వర్షం
– రేపటి వరకు విస్తారంగా కురుస్తాయన్న వాతావరణ శాఖ
నవతెలంగాణ –
కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
నిప్పులు కక్కిన ఎండ నుంచి వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఊరిస్తూ.. ఉసూరుమనిస్తూ వాన కురుస్తున్నా.. ఇంకా వర్షం చుక్క జాడేలేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. చిరుజల్లులు, మోస్తారు వర్షం తప్ప ఎక్కడా సాధారణ వర్షపాతంలో కనీసం 10శాతం పడటం లేదు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని సగం మండలాల్లో చుక్క వాన పడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి రెండు జిల్లాల్లో తప్ప మిగతా చోట్ల వానలు పడుతున్నాయి. అయితే, ఏమంత పెద్ద వర్షాలు కావు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఆశించిన వర్షాల్లేవని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దుక్కులు దున్ని సాగుకు సన్నద్ధమైన పత్తి, మొక్కజొన్న రైతులు ఇంకా అదును దాటితే కష్టనష్టాలే ఎదురవుతాయని ఆందోళన చెందుతున్నారు. అయితే రేపటిలోగా వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ సూచించడం కొనమెరుపు.
సాధారణంలో 10శాతమూ కురవని వానలు
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ఏ మండలంలోనూ సాధారణ వర్షపాతంలో కనీసం 10శాతం కూడా వర్షాలు పడలేదు. సగం మండలాల్లో చుక్క కూడా కురవలేదు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. రాజన్నసిరిసిల్ల జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 108.9మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 134.2మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ ఏడాది 27.3మిల్లీమీటర్ల వర్షపాతమూ నమోదు కాలేదు. ఈ జిల్లాలోని 13 మండలాల్లో 10 మండలాల్లోనూ సాధారణ వర్షపాతంలో కనీసం 3శాతం కూడా వర్షాలు పడలేదు. ముస్తాబాద్‌, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో మాత్రమే కొంతమేర వర్షం కురిసింది. కరీంనగర్‌ జిల్లాలో గంగాధర, రామడుగు, చొప్పదండి, మానకొండూర్‌, ఇల్లందకుంట మండలాల్లో ఇప్పటికీ చుక్కవాన పడలేదు. గన్నేరువారం, కరీంనగర్‌, తిమ్మాపూర్‌, జమ్మికుంట మండలాల్లో కేవలం ఆదివారం మాత్రమే 2మిల్లీమీటర్లలోపు వర్షం పడింది. శంకరపట్నం, హుజూరాబాద్‌లో సాధారణ వర్షపాతంలో సగం మేర వర్షం కురిసింది. ఇదే పరిస్థితి అటు పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోనూ నెలకొంది. ఈ రెండు జిల్లాల్లో కూడా ఎక్కడా సాధారణ వర్షపాతంలో కనీసం 20శాతం మించి వర్షాలు పడలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా కరీంనగర్‌ జిల్లాలో 73,803 మంది రైతుల ఖాతాల్లో రూ.19.63కోట్లు రైతుబంధు నిధులు జమ చేసింది.
వరి నార్లు పోయని రైతులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13లక్షల ఎకరాల్లో అన్ని పంటలూ సాగవుతాయని వ్యవసాయాధికారులు వేసిన అంచనాలో 9,46,500 ఎకరాల్లో వరి సాగవ్వనుంది. పత్తి 2,07,745 ఎకరాల్లో సాగవ్వనుంది. లక్షా 51వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగుకానున్నాయి. ఈ తొమ్మిదేండ్ల కాలంలో జూన్‌ మొదటి వారంలోనే వర్షాలు పడ్డాయి. ఈ ఏడాది జూన్‌ 26 దాటినా మబ్బులచాటున దాగుడుమూతలు ఆడుతున్నాయి. ప్రతిరోజూ వర్షం పడుతుందని ఎదురుచూస్తున్న రైతాంగానికి నిరాశే మిగులుతోంది. జూన్‌ మొదటివారంలోనే పత్తి విత్తనాలు వేసిన భూముల్లో వర్షాభావం కారణంగా మొలకలే రాలేదు. మొక్కజొన్న పరిస్థితి కూడా ఇలాగే ఉండటంతో చాలా మంది రైతులు దుక్కులు దున్ని వదిలేశారు.
ఇదే సమయంలో ఉద్యానవన పంటలకూ ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. ఇదివరకు ఉమ్మడి జిల్లాలో మామిడి, పసుపు, కూరగాయలు, మిరప, సీతాఫల్‌, అరటి, బొప్పాయి, పూలు, అల్లం, కర్బూజా వంటి పంటలు అధికంగా సాగు చేసే వారు. క్రమంగా వాటి విస్తీర్ణం కూడా పెద్దఎత్తునే తగ్గిపోయింది. ఇప్పటివరకు కేవలం ఉమ్మడి జిల్లాలో 76వేల ఎకరాల్లో మామిడి, 30వేల ఎకరాల్లో పసుపు, 20వేల ఎకరాల్లో మిరప, సుమారు 18వేల ఎకరాల్లో కూరగాయల సాగు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా ఉద్యానవన పంటలు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు రైతులు కోరుతున్నారు.
వర్షాల్లేక వరి మళ్లుదున్నలే.. రైతు జారతి సత్యం, గంగాధర
నాకున్న 4.30ఎకరాల పొలంలో ఇంతవరకూ వరి మళ్లు దున్నలే. ఇప్పటికీ వాన జాడలేదు. బాయిల నీళ్లు లేవు. మొన్నటి యాసంగిలో రాళ్ల వానకు ఉన్న పంటంత పోయింది. ఇప్పుడు కాలం ఇంకా అయితలేదు.
నీళ్లు లేక బీళ్లుగా..రైతు దాది జలపతి, గర్శకుర్తి
మా ఊళ్ల వరద కాల్వల నీళ్లులేవు. వర్షాల్లేక బాయిల్ల సరిపడా నీరందుతలేదు. దీంతో భూములన్నీ ఇప్పుడు బీళ్ల గానే ఉన్నరు. నాకున్న పది ఎకరాలూ నీటిపారకం లేక వర్షం మీదనే ఆధారపడి పంటలేసుకుంట. ఇప్పుడు దుక్కులు దున్ని ఎదురుచూస్తున్న. వర్షాలు వస్తేతప్ప విత్తనాల వేసుకునే పరిస్థితి లేదు.