– ప్రజల ఖాతాల్లో పదిహేను లక్షలేస్తామనడం ఎంత నిజమో.. ఇదీ అంతే..
– మరో పదేండ్లు గడిచినా అమలుకావు : కాంగ్రెస్ దేశవ్యాప్త ప్రచారం
న్యూఢిల్లీ : చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించే విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ డొల్లతనాన్ని ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరో పది సంవత్సరాలు గడిచినా ఈ రిజర్వేషన్లు అమలులోకి రావని స్పష్టం చేసింది. మహిళా బిల్లును మోడీ ఎలా అపహాస్యం చేస్తున్నారో, తాను చేయని పనికి ప్రయోజనం పొందేందుకు ఎలా ప్రయత్నిస్తున్నారో ప్రజలకు వివరిస్తూ రాష్ట్ర రాజధానుల్లో 21 పత్రికా సమావేశాలు నిర్వహిం చింది. ఈ సమావేశాలను ఉద్దేశించి మహిళా నేతలే ప్రసంగించడం విశేషం. ప్రజల ఖాతాలో రూ.15 లక్షల రూపాయలు వేశామని చెప్పడం ఎంత నిజమో, ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం ఎంత నిజమో, బులెట్ రైలు నడిపామని చెప్పడం ఎంత నిజమో మహిళా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడంలో కూడా అంతే నిజముందని ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్లకు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన పేరుతో అనవసరమైన షరతులు విధించారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. మహిళలకు సాధికారత కల్పించడం ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీలకు ఇష్టం లేదని, అందుకే రిజర్వేషన్ల అమలును ఆలస్యం చేసేందుకు మోడీ ఈ ఎత్తుగడ వేశారని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండే మహిళలకు ఓటింగ్ హక్కులు కల్పించడం ద్వారా లింగ సమానత్వం కోసం కాంగ్రెస్ కృషి చేసిందని, పంచాయతీరాజ్ సంస్థలలో మహిళలకు 33శాతం సీట్లు కేటాయించిందని గుర్తు చేశారు. బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, అయితే దానిని ఆమోదించే ప్రక్రియలో రాజకీయ ప్రతిఘటనను మోడీ ప్రభుత్వం అణచివేసిందని విమర్శించారు. మహిళలకు తక్షణమే రిజర్వేషన్లు ఇవ్వడం బీజేపీ నాయకులకు ఇష్టం లేదని అంటూ మహిళలకు ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకమని, ఈ కీలకమైన సంస్కరణను కేవలం ఎన్నికల ఎత్తుగడగా వాడుకోవాలని మాత్రమే వారు కోరుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.