– మూడో పంట లక్ష్యంగా సాగు నీరు..
– నీళ్లు తెచ్చి రెండు పంటలు గ్యారెంటీ చేశాం
– మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ
– ప్రమాణ స్వీకరణోత్సవంలో ఎమ్మెల్యే పెద్ది
నవతెలంగాణ-నర్సంపేట
మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం రైతులకు భద్రత, భరోసాగా నిలిచి కీర్తి ప్రతిష్టలు పెంచాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం మార్కెట్ కార్యాలయ ఆవరణంలో నిర్వహించిన నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకరణోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాట్లాడారు. మార్కెట్ కమిటీ రైతులు పండించిన పంటోత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రైతులకు, వ్యాపారులను సమన్వయం చేస్తూ ముందుకు సాగాలన్నారు. రైతులు సుభిక్షింగా ఉండాలని వ్యాపారులు ఆకాంక్షించాలని సూచించారు. పార్టీలో అవకాశాలు అనేది కొందరికే దక్కుతాయని అనేక అంశాలను పరిగణంలోకి తీసుకొని ప్రాధన్యత కల్పించాల్సి వస్తుందన్నారు. అవకాశాలు రాని వారిని తక్కువ ప్రాధన్యత ఉంటుందని భ్రమ పడాల్సిన అవసరం లేదన్నారు. ఆయా సామాజిక తరగతుల వారిగా అందరికి అవకాశాలు దక్కుతాయని తెలిపారు. తన 30 యేండ్ల రాజకీయ చరిత్రలో అనేక కష్టాలు, త్యాగాలు చేస్తూ నిరీక్షించినందునే ఈ రోజు ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే అయ్యే అదృష్టం దొరికిందన్నారు. పేద కుటుంబానికి చెందిన పొన్నం మొగిళికి చైర్మన్‌గా ఏకాభిప్రాయం వచ్చిందని తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అవకాశాలు రానివారందరిని కడుపులో పెడుకొని కాపాడుకుంటానని హామీనిచ్చారు.
– నాడు కాల్వలు మాత్రమే తవ్వి వదిలేశారు..
– మేము నీళ్లు తెచ్చి రైతుల కాళ్లు కడిగాం..
50 యేండ్లగా పాలన సాగించిన వారు కాల్వలు మాత్రమే తవ్వి వొదిలేస్తే నిర్జీవంగా ఉండిపోగా కేసీఆర్ ప్రభుత్వం నీళ్లు తెచ్చి రైతుల కాళ్లు కడిగిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగంలో నర్సంపేట కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. దేవాదుల ఎత్తిపోతలతో రంగయ చెరువు, పాకాల, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా 200లకు పైగా చెరువులను నింపి రెండు పంటలు గ్యారెంటీగా సాగయ్యేలా చరిత్ర సృష్టించామన్నారు. మూడో పంట వైపు అడుగులు వేయడానికి తగిన ప్రణాళిక సిద్దం చేస్తున్నామని చెప్పారు. ఇదే కాకుండా ప్రకృతి వైపరీత్యాలతో రెండు దఫాలుగా నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అందజేసి అండగా నిలిచామన్నారు. 50 వేల మంది రైతులకు ఇన్‌ఫుడ్ సబ్సిడీ అందశామన్నారు. సామాన్య రైతుకు ఎంతటి మానసిక ఒత్తిడి లోనౌతాడో ఓ రైతు బిడ్డగా తెల్సు అన్నారు. కష్టాల్లో ఉన్న రైతుకు మరింత ఆదుకోవడానికి నర్సంపేట రైతులను ఓదార్చడానికి వచ్చిన కేసీఆర్‌కు దండం పెట్టి రూ.75 కోట్ల విలువజేసే వ్యవసాయ ఆధునీకరణ పనిముట్లను మంజూరు చేయించానన్నారు. ఇది రాష్ట్రంలో ఎక్కడ లేదని ఒక్క నర్సంపేటకు మాత్రమే అవకాశం దక్కడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఎక్కడ చందాలు, దందాలు లేవని బ్రహ్మాండంగా రైతు అభిష్టానుసారంగానే ఆధునీకరణ పరికరాలు సబ్సిడీపై అందజేస్తున్నామన్నారు. 50 యేండ్లలో ఎక్కడా లేనివిధంగా ఈ పైలెట్ ప్రాజెక్టు రైతులకు ఒక వరంగా నిలువనుందని తెలిపారు. మరో మారు తనను శక్తివంతుడిని చేస్తే రైతులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ పొన్నం మొగిళి, వైఎస్ చైర్మన్ పాలెపు రాజేశ్వరావుతో పాటు 18 మంది డైరెక్టర్‌లు పదవీ బాధ్యతల ప్రమాణ స్వీకరణ చేశారు.జెడ్పీ వైఎస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ గుంటి రజనీకిషన్, రైతు సమన్వయ సమితి డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీదర్‌రావు, బత్తిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.