మూతపడిన పాఠశాల తిరిగి ప్రారంభం ఫలించిన సర్పంచ్‌, గ్రామస్థుల కృషి

– మల్లారెడ్డిపేట పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేత
నవతెలంగాణ-మునిపల్లి
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని మల్లారెడ్డిపేట పాఠశాల ఎట్టకేలకు తిరిగి ప్రారంభమైంది. విద్యార్థులు లేరనే కారణంతో ఇటీవల పాఠశాలను మూసివేశారు. పాఠశాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ సర్పంచ్‌ శివ జ్యోతి ఆధ్వర్యంలో ఈనెల 20న విద్యాదినోత్సవం రోజున గ్రామస్థులు ధర్నా చేశారు. ఈ విషయం నవతెలంగాణ పత్రికలో ప్రచురితం కాగా.. మండల విద్యాధికారి దశరథ్‌ స్పందించారు. అక్కడ పనిచేసిన ఉపాధ్యాయుడు అరవింద్‌ను మరో పాఠశాలకు తాత్కాలిక సర్దుబాటు చేసినందున.. గ్రామస్థుల కోరిక మేరకు చీలపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రవీణ్‌ కుమార్‌ను మల్లారెడ్డిపేటలో నియమించి పాఠశాలను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు, పెన్నులు, పలకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ శివజ్యోతి, మంజీర రైతుసంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్‌, గ్రామ పంచాయతీ పాలకవర్గ వార్డు సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.