పారిశ్రామిక ప్రగతి ప్రస్థానం ఆరంభం మాత్రమే

– భారీ ఎత్తున విదేశీపెట్టుబడులు
– తలసరి ఆదాయంలో మనమే నెం.1
– పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌
‘తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ప్రస్థానం ఇప్పుడే ప్రారంభమైంది. తెలంగాణ మోడల్‌ అంటే సమగ్ర, సమీకత, సమ్మిళిత, సమతుల్య మోడల్‌. ఐటీ రంగం నుంచి మొదలుకుని వ్యవసాయ రంగం వరకు అన్ని రంగాల్లోనూ రాష్ట్రం తన ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది. గ్రామీణ పట్టణ ప్రాంతాలు, పేద, మధ్యతరగతి, ధనిక వర్గాలు అనే తేడా లేకుండా అందరి ప్రగతికి పాటుపడుతున్నది’ అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో మంగళవారం పరిశ్రమల శాఖ నిర్వహించిన ‘తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం’లో ఆయన మాట్లాడారు. ఒక్కో పెట్టుబడిని రాష్ట్రానికి తేవాలంటే ఎంతగానో కష్టపడాల్సి ఉంటుందని, దేశ విదేశాల నుంచి రాష్ట్రాల వరకు పోటీపడి మరీ పెట్టుబడులను ఇక్కడికి రప్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు విదేశీ పర్యటనలు చేశామని చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో యువతకి సాధ్యమైనన్ని ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న తపన తమను ఆ పర్యటనలో కష్టపడేటట్టు చేస్తున్నదని అన్నారు. రాష్ట్ర ప్రతినిధి బందం విదేశాల్లో పెద్ద ఎత్తున చేపట్టే నిరంతర సమావేశాలకు అక్కడి పారిశ్రామిక వర్గాలు, దౌత్య వర్గాల నుంచి అనేకసార్లు ప్రశంసలు లభించాయని గుర్తుచేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వచ్చేలా పనిచేసిన పరిశ్రమల శాఖ బందంలోని ప్రతి ఒక్క అధికారికీ మంత్రి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తమతో పని చేస్తున్న అత్యంత నైపుణ్యం కలిగిన అధికారులు ప్రయివేట్‌ సెక్టార్‌లో పనిచేస్తే అనేక రెట్ల వేతనం ప్యాకేజీ వస్తుందని, వాటిని కాదనుకుని తెలంగాణ కోసం పనిచేస్తున్న వారందరికీ కతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.3.17లక్షలు ఉందని, ఇదీ దేశంలోనే అత్యధికమని అన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీ 2014లో రూ.5 లక్షల కోట్లు ఉండగా ప్రస్తుతం అది రూ.13.27 లక్షల కోట్లకు చేరిందని, ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్ల నుంచి రూ.2.40 లక్షల కోట్లకు చేరాయని గుర్తుచేశారు. ఒకవైపు పారిశ్రామిక ప్రగతితో పాటు ఆర్థిక ప్రగతి, సామాజిక ప్రగతిని సమాంతరంగా ముందుకు తీసుకెళుతున్న ప్రభుత్వం తమదని వివరించారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో జరిగిన పారిశ్రామిక ప్రగతి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, రియల్‌ ఎస్టేట్‌ వంటి ఇతర రంగాలు బలోపేతమవుతున్నాయని కేటీఆర్‌ ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్‌, కమిషనర్‌ నర్సింహారెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖల అధికారులు పాల్గొన్నారు.