హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది పాత్ర విశిష్టమైనదని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఘనంగా నిర్వ హించారు. ఉదయం 8.30 నిమిషాలకు కార్యాలయం పైన జాతీయ జెండాను ఎగరేసి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకటి మాట్లాడారు. చరిత్రలో రాష్ట్ర ఆవిర్భావం ఒక అద్భుతం అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు రాష్ట్ర ప్రజల చిరకాల ఆకాంక్ష అని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో శర వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలలిపారు. ముఖ్యంగా వైద్య, ఆరోగ్య రంగంలో అసమాన అభివృద్ధి సాధించినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆశీస్సులు, జిల్లా మంత్రుల తలసాని శ్రీనివాస్ యాదవ్, మహ్మద్ అలీతోపాటు ఇతర ప్రజాప్రతినిధుల అందరి సహకారంతో హైదరా బాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్రానికి తలమాని కంగా మారిందన్నారు. జిల్లా వైద్యులు, వైద్య సిబ్బంది సమిష్టి కృష్టితో 52శాతం ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను 73 శాతానికి పెంచినట్టు తెలిపారు. ఇది రాష్ట్ర సగటు కంటే అధికం అని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రుల సహకారంతో హైదరాబాద్ జిల్లాలో 161 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి బస్తీవాసులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. వ్యాధి నిరోధక టీకాలు, కేసీఆర్ కిట్స్, న్యూటిషియన్ కిట్స్, ఎన్‌సీడీ కిట్స్ పంపిణీ, అంటు వ్యాథులను అరికట్టుట, జీవన శైలి వ్యాధులపై అవగాహన, చికిత్స, గర్భిణుల నమోదు, ప్రమాదకర గర్భిణులను గుర్తించి అంకిత్స అందించడం, క్షయ, కుష్టు వ్యాధి నివారణా కార్యక్రమాలు చేపట్టడం, కీటక జనిత వ్యాధులపై అవగాహన, చికిత్స, స్కానింగ్ సెంటర్లపై నిఘా, ప్రయివేటు హాస్పిటల్స్‌పై పర్యవేక్షణ, బడి పిల్లలు, హాస్టల్ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వంటి కార్యక్రమాలు విజయవంతంగా, సమిష్టి కృషితో నిర్వహిస్తూ హైదరాబాద్ జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో నిలిపిన వైద్యులు, సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుధ, వెంకటేశ్వర్లు, శ్రీకళ, నాగరాజు, నిరంజన్, శ్రీనివాస్‌రావు, తదితరులు పాల్గొన్నారు.