పదోన్నతులు బదిలీల షెడ్యూల్ ను వెంటనే ప్రకటించాలి

– యూఎస్పిఎస్సి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు వై విజయకుమార్

నవతెలంగాణ – కంటేశ్వర్
పదోన్నతులు బదిలీల షెడ్యూల్ను వెంటనే ప్రకటించాలని యూఎస్పిఎస్సి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు వై విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ ను తక్షణమే విడుదల చేసి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని యుఎస్పిసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు వై. విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ ఇచ్చిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్ వద్ద నిర్వహించిన ధర్నా శిబిరం ప్రారంభిస్తూ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. పదోన్నతులు, బదిలీలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అనేక మంది ఉపాధ్యాయులు పదోన్నతులు లేకుండానే రిటైర్డ్ అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 25 వేల ఉపాధ్యాయ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించనీ యెడల వేలాది ఉపాధ్యాయులతో సెప్టెంబర్ ఒకటో తేదీ చలో హైదరాబాద్ మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. ధర్నా శిబిరo ఉద్దేశించి రాష్ట్ర నాయకులు పి. శంతన్, డి. సత్యానంద్ లు మాట్లాడుతూ సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి కట్టుబడి సాధారణ ఎన్నికలలోపు స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని, సిపిఎస్ విధానంలో రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, పెన్షన్ గా 2000 రూపాయలు కూడా పొందలేని దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. 317 జీవో వల్ల సొంత జిల్లా వదిలి ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు సొంత జిల్లాలకు బదిలీ చేయడానికి అవసరమైతే సూపర్ న్యుమరి పోస్టులు సృష్టించాలని, భార్య భర్తల బదిలీలు నిలిపివేసిన 13 జిల్లాల ఉపాధ్యాయులకు బదిలీలు చేపట్టాలని,317 జీవో బదిలీల వల్ల అన్యాయానికి గురై అప్పీలు చేసుకున్న ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు. ఒ. రమేష్, వి. సురేష్, ఎం. బాలయ్య, సిహెచ్. సుధాo లు ధర్నా శిబిరం ఉద్దేశించి మాట్లాడుతూ మొదటి పే రివిజన్ కమిషన్ గడువు 2023 జూన్ 30తో ముగిసినందున తాత్సారం చేయకుండా వెంటనే రెండవ పిఆర్సి కొరకు కమిషన్ను నియమించాలని, జూలై 2023 నుండి అమలయ్యె ల తాత్కాలిక భృతిని 25% ప్రకటించాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లుల కు తక్షణమే చెల్లింపులు జరపాలని, వేతనాలు చెల్లింపులో జాప్యాన్ని నివారించి ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు చెల్లించాలని, పాఠశాల మరుగుదొడ్ల శుభ్రపరిచే సర్వీస్ పర్సన్ల నియామకం చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నా శిబిరంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఆర్. రాజన్న, సల్ల సత్యనారాయణ, భోజన్న, నాయకులు, పి.దాసు, రాందాస్, ప్రవీణ్, గంగాధర్, అరవింద్, చందర్, తుకారం, లింగం, పెంటన్న, గంగ నరసయ్య, బాలరాజు,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.