మోగనున్న బడిగంటలు

నేటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం
 హైదరాబాద్‌లో 2వేలకుపైగా స్కూళ్లు..7.50లక్షల మంది
విద్యార్థులు
 అరకొరగానే పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, యూనిఫామ్‌ పంపిణీ!
 సమస్యల నడుమే విద్యా సంవత్సరం ఆరంభం..
నవతెలంగాణ-సిటీబ్యూరో
రెండు నెలల పాటు వెలవెలబోయిన పాఠశాలలు సోమవారం నుంచి విద్యార్థులతో కళకళలాడనున్నాయి. వేసవి సెలవుల్లో వివిధ ప్రాంతాల్లో గడిపిన విద్యార్థులు నేటి నుంచి మళ్లీ బడిబాట పట్టనున్నారు. అయితే ప్రభుత్వ బడుల్లో మరోసారి సమస్యల లోగిల్లుగానే దర్శనమివ్వనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏడాది క్రితం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన మనబస్తీ-మన బడి పథకం ద్వారా ప్రభుత్వ బడుల్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధి పనులు వివిధ కారణాలతో ఆశించిన స్థాయిలో పూర్తికాలేదు. ఫలితంగా సర్కారు స్కూళ్లలో మౌలికవసతులు వెక్కిరింత, పాత గోడలు, ఇరిగిన బల్లల నడుమే కొత్త విద్యాసంవత్సరంలో విద్యార్థులు చదువు కొనసాగించనున్నారు. మరోవైపు టీచర్ల కోరతతో మళ్లీ ఇబ్బందులు తప్పేలా లేవు. ఏటా విద్యార్థులకు సమస్యల సవాళ్లు విసరడమే తప్ప.. సజావుగా విద్యనేర్పే పరిస్థితి ఈసారి కూడా కనిపించడంలేదు. అంతిమంగా ఇది ప్రయివేటు పాఠశాలలకు మేలు చేయడంతో పాటు సర్కార్‌ బడులను నిర్లక్ష్యమే చేయడమే అవుతుందని ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం 2200వేలకుపైగా ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రయివేట్‌ పాఠశాలలుండగా.. వీటిలో సుమారు 7.80లక్షలకుపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. 690 ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలకు 1.17 లక్షల మంది విద్యార్థులు, 245 ఎయిడెడ్‌ స్కూళ్లకు 36వేల మంది, 1222 ప్రయివేటు పాఠశాలలకు 6.59లక్షల మంది వెళ్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో ఈ సంవత్సరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలు 80.29శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తేనే.. సర్కార్‌ బడులు ఈ ఏడాది మరిన్ని ఉన్నతమైన ఫలితాలు సాధించే అవ కాశముందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.
ఈసారైనా ప్రమోషన్లు, బదిలీలు అయ్యేనా?
జిల్లాలోని సర్కార్‌ బడుల్లో ఉపాధ్యాయులు కొరత తీవ్రంగా ఉంది. టీచర్ల కొరత కారణంగా విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందడం లేదని విమర్శలున్నాయి. మరోవైపు జిల్లావ్యా ప్తంగా వెయ్యికిపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ లున్నాయి. గతంలో ఈ ఖాళీల స్థానంలో విద్యావాలంటీర్లను నియ మించుకుని కాలం వెళ్లదీసినా.. రెండేండ్లుగా వీవీల నియ మాకంపై ఊసే లేదు. ఉన్నవారితో విద్యాసంవత్సరం నెట్టుకొ స్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక గత జనవరిలో ప్రభుత్వం ఉపాధ్యా యులు ప్రమోషన్లు, బదిలీలంటూ కాస్త హడావుడి చేసినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. కనీసం ఈ విద్యాసంవ్సతరం ప్రారం భంలోనైనా ఉపాధ్యాయులు బదిలీలు, ప్రమోషన్లు ప్రక్రియ పూర్తి చేసి.. తద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది.
స్కూల్‌ గ్రాంట్స్‌ ఎప్పుడో..?
జూన్‌ నెలలోనే పాఠశాలల గ్రాంట్స్‌ విడుదల చేయడం ద్వారా స్కూళ్లకు కావాల్సిన మరమ్మతులు చేసుకునే వీలుంటుంది. కానీ సకాలంలో గ్రాంట్స్‌ విడుదల కాక.. చిన్న చిన్న మరమ్మత్తులు జరగడం లేదు. అలాగే ఉపాధ్యాయులు కనీసం చాక్‌పీస్‌, డస్టర్‌, చోటామోటా మరమ్మతులు, రిజిష్టర్లు కొనుగోలు చేసేందుకు తమ సొంత డబ్బులను ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఆరంభంలోనే గ్రాంట్స్‌ విడుదల చేస్తే ప్రయోజనం ఉంటుందనే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేసే స్కావెంజర్లు లేరు. తిరిగి స్కావెంజర్ల వ్యవస్థను పునరుద్ధరిస్తే బాగుంటుందని టీచర్లు, తల్లిదండ్రులు అంటున్నారు.
సగమే చేరిన పుస్తకాలు, ఏకరూప దస్తులు
పదో తరగతి ఫలితాల్లో ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలుఏ ఫలితాలు సాధిస్తున్నాయి. దాంతో ఈ సంవత్సరం ప్రభుత్వ స్కూళ్లలో తమ పిల్లలను చదివిస్తే బావుంటుందనే నమ్మకం విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొంత ఏర్పడింది. కానీ అందుకు తగ్గట్టుగా టీచర్ల నియమాకాలు, బడుల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తేనే పూర్తి నమ్మకం వస్తుంది. మనబస్తీ, మన బడి ద్వారా జిల్లా వ్యాప్తంగా మొదటి విడుతలో 159 స్కూళ్లుకు గాను 17 స్కూళ్లలోనే అభివృద్ధి పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. మరో 14 ప్రారం భానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక విద్యార్థులకు ఏకరూప దుస్తు లు, పాఠ్యపు స్తకాలు, నోట్‌ పుస్తకాలు పూర్థిస్థాయిలో అంద లేదని తెలుస్తోంది. మరోవైపు సర్కారు స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం బోధన ప్రచారానికే పరిమితమైంది. ఇలాగైతే పేద, మధ్య తరగతికి చెందిన పేరెంట్స్‌ తమ పిల్లలను ప్రయివేట్‌ స్కూళ్లలో కాకుండా ప్రభుత్వ బడుల్లో ఎలా చేర్పిస్తారానే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోవైపు ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు భారీగా ఫీజు వసూళ్లకు రంగం సిద్ధం చేసుకున్నాయి. రకరకాల కోర్సులతో పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను దగా చేసేందుకు కాచుకు కూర్చుకున్నాయి. కాబట్టి ప్రభుత్వం గురుకులాల మాదిరిగా సర్కారు విద్యను బలోపేతం చేస్తేనే అందరికీ మేలు జరగనుంది.