‘టైటాన్‌’ అన్వేషణ విషాదాంతం..

ఐదుగురు మృతి : అమెరికా కోస్ట్‌గార్డ్‌ ప్రకటన
బోస్టన్‌ : అట్లాంటిక్‌ మహాసముద్రంలో తప్పిపోయిన పర్యాటకుల మిని జలాంతర్గామి ‘టైటాన్‌’ అన్వేషణ విషాదాంతమైంది. సముద్ర గర్భంలో టైటానిక్‌ సమీపంలో టైటాన్‌ శకలాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్‌గార్డ్‌ ప్రకటించింది. టైటాన్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు చనిపోయారని, వారి కుటుంబ సభ్యులకు తెలిపినట్లు పేర్కొంది. సముద్రంలో సుమారు 4 కిలోమీటర్ల లోతులో ఉన్న టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు ఆదివారం బయలుదేరిన టైటాన్‌ కొన్ని గంటల్లోనే తప్పిపోయిన విషయం తెలిసిందే. భారత కాలమాన ప్రకారం… గురువారం సాయంత్రం 7 గంటల 15 నిమిషాల వరకే ఆక్సిజన్‌ సరిపోతుందని అంచనా వేశారు. పాకిస్థాన్‌ బిలియనీర్‌ షెహజాదా దావూద్‌ (48), ఆయన కుమారుడు సులేమాన్‌ (19), బ్రిటీష్‌ వ్యాపారవేత్త హమీష్‌ హార్డింగ్‌, ఈ యాత్ర నిర్వాహకుడు స్టాక్టన్‌ రష్‌, ఫ్రెంచ్‌ మాజీ నావికా అధికారి పాల్‌ హెన్రీ ఈ జలాంతర్గామిలో ఉన్నారు. మూడు రోజుల నుంచి వీరి ఆచూకీ తెలియలేదు. కెనడా, అమెరికా తీర రక్షక దళాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. వీరు ప్రయాణిస్తున్న టైటాన్‌లో 96 గంటలకు సరిపడా ఆక్సిజన్‌ నిల్వలే ఉండడంతో క్షణక్షణం ఉత్కంఠగా మారింది. గురువారం సాయంత్రం రిమోట్‌ ఆపరేటెడ్‌ వెహికల్‌ సహాయంతో టైటానిక్‌ నౌకకు సమీపంలో కొన్ని శకలాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్‌గార్డ్‌ ప్రకటన విడుదల చేసింది.
తీవ్రమైన పీడనం పెరగడం వల్లే పేలుడు…
తీవ్రమైన పీడనం పెరగడం వల్ల ‘టైటాన్‌’ పేలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్‌గార్డ్‌ ప్రకటించింది. రిమోట్‌ కంట్రోల్డ్‌ వెహికల్‌ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించామని తెలిపింది. టైటానిక్‌ ఓడ సమీపంలో 488 మీటర్ల దూరంలో ఈ శకలాలను గుర్తించినట్లు యుఎస్‌ కోస్ట్‌ గార్డ్‌ పేర్కొంది. వెంటనే ఈ విషయాన్ని బాధితుల కుటుంబాలకు తెలిపినట్లు రియర్‌ అడ్మిరల్‌ జాన్‌ మౌగర్‌ తెలిపారు. యుఎస్‌ కోస్ట్‌ గార్డ్‌, రెస్య్కూ సిబ్బంది తరఫున మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఈ ఐదుగురు నిజమైన అన్వేషకులు : ఓషన్‌ గేట్‌ సంస్థ
”ఈ ఐదుగురు నిజమైన అన్వేషకులు. ప్రపంచ మహాసముద్రాల అన్వేషణ, రక్షణలో వీరు ఎంతో అభిరుచిని కలిగిఉన్నారు. ప్రస్తుత ఈ విషాద సమయంలో వీరి కుటుంబాల గురించే మా ఆలోచనలు ఉన్నాయి. ఈ ఘటనకు చింతిస్తున్నాం” అని ఓషన్‌ గేట్‌ సంస్థ యుఎస్‌ కోస్ట్‌గార్డ్‌ వివరణకు ముందు ఒక ప్రకటన విడుదల చేసింది