– ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం
– త్వరలో… ఇల్లందులో వంద పడకల వైద్యశాల
– ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ
నవతెలంగాణ-ఇల్లందు
అన్ని రకాల వైద్యం ప్రజలకు నేడు అందుబాటులోకి వచ్చాయని డయాలసిస్ కేంద్రాలు రాష్ట్ర చరిత్రలో అద్భుతమని, పేదలకు వరమని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో శనివారం డయాలసిస్ సెంటర్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం చేరడం ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతోందన్నారు. ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ లేకపోవడం వల్ల గ్రామాల డయాలసిస్ రోగులు దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వెళ్లడంలో చాలా ఇబ్బందులు పడ్డారని ఈరోజు వారికి ఉపయోగపడేలా ఇల్లందు ప్రభుత్వ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో డయాలసిస్ కోసం ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ వెళ్లేవారన్నారు. ఇక వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, 5 బెడ్లతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు జరిగిందన్నారు. ఏదైనా జబ్బు చేసి ఆస్పత్రికి వెళ్తే..చికిత్స కంటే వైద్య పరీక్షలకే ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయని, మూత్ర పరీక్ష నుంచి రక్త పరీక్ష వరకు ఏవేవో టెస్ట్‌లు రాస్తారని, వాటికి వేలకు వేలు డబ్బులు పోయాల్సి వస్తుందన్నారు. సామాన్య ప్రజలపై ఈ భారం పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసిందని అన్నారు. అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలకు అవసరమైన పరికరాలను ప్రభుత్వం సిద్ధం చేస్తుందన్నారు. ఆస్పత్రుల స్థాయి ఆధారంగా ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల సేవలను అందించనున్నారు. సమైక్య రాష్ట్రంలో కేవలం 7 మెడికల్ కాలేజీలు ఉన్నాయని ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు జరుగుతోందన్నారు. ఆరోగ్య శ్రీ, సీఎంఆర్‌ఎఫ్, ఎల్‌ఓసిల ద్వారా రూ.లక్షల్లో ఉచిత చికిత్సలు లక్షలాది రూపాయల చికిత్సలకూ ఉచితంగా వైద్యం అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కిందన్నారు.
డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్‌కు, వైద్య శాఖ మంత్రి హరీష్ రావుకు, మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజరు కుమార్ నియోజక వర్గ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి డాక్టర్ రవి బాబు, మున్సిపల్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌లు దమ్మలపాటి వెంకటేశ్వరరావు, కమిషనర్ అంకుషావలి, దిండిగాల రాజేందర్, వైద్య శాల సూపర్డెంట్ డాక్టర్ శిరీష్ కుమార్, డీఎంఓ డాక్టర్ హర్షవర్ధన్, డిప్యూటీ డీయంఓ డాక్టర్ భన్సిలాల్, ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ మురళీధర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జానీ పాషా, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పులిగళ్ల మాధవరావు పాల్గొన్నారు.