ఈనెల 12న పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ కార్యాలయ ముట్టడి .. జీఎంపీఎస్‌ పిలుపు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
గొల్లకురుమల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12న పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించాలని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం (జీఎంపీఎస్‌) పిలుపునిచ్చింది. గొర్రెలు ఇస్తామంటూ గొల్లకురుమలతో డీడీలు కట్టించి, గొర్లు ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించింది. గొర్లు ఇవ్వకుండా ఆలస్యం చేయడంతో వారంతా అప్పులపాలయ్యారని పేర్కొంది. శుక్రవారం హైదరాబాద్‌లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో జీఎంపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు కిల్లె గోపాల్‌ అధ్యక్షతన రాష్ట్ర ఆఫీస్‌ బేరర్ల సమావేశం జరిగింది. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్‌ మాట్లాడుతూ జూన్‌ 9వ తేదీన రెండో విడుత గొర్రెల పంపిణీ ప్రారంభించినట్టు రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేసిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 1500 మందికి మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేకుండా, కనీస ప్రణాళిక లేకుండా అందరిని ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఇచ్చిన గొర్రెల్లో ముసలి గొర్లు, చిన్నపిల్లలనే ఎక్కువ చోట్ల ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంకా మిగిలిన 3.5లక్షల మందికి కావాల్సిన రూ. 6వేల కోట్ల నిధుల్ని కేటాయించాలని డిమాండ్‌ చేశారు. నగదు బదిలీతో గొర్లకాపరులు తమకు నచ్చినచోట ఇష్టమొచ్చిన గొర్లు కొనుక్కునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే దశలవారిగా జిల్లా అధికారులకు,శాసన సభ్యులకు మెమోరాండాలు ఇచ్చామని గుర్తు చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు అవిశెట్టి శంకరయ్య, బొల్లం అశోక్‌, మద్దెపురం రాజు, తుషాకుల లింగయ్య, అమీర్‌పేట్‌ మల్లేష్‌, కాల్వ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.