ఈడీ నోటీసులు రద్దుచేయాలి

– సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌
– దీనిపై 24న విచారణ
– థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తోంది : పిటిషన్‌లో కవిత
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె.కవిత అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కానీ ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 24న విచారణ చేపడతామని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ పిఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం ముందు కవిత తరపున న్యాయవాది వందన సెహెగల్‌ బుధవారం ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని కోరారు. ఒక మహిళను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయానికి పిలవడం సరికాదని అన్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. మనీ లాండరింగ్‌ కేసులో కవితను ఈడీ అధికారులు ఈ నెల 11న గంటల తరబడి ప్రశ్నించారని గుర్తు చేశారు. కవిత నివాసానికి బదులుగా ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించడంలో అర్థంలేదని పేర్కొన్నారు. తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించడం క్రిమినల్‌ చట్టాలకు వ్యతిరేకమని వాదించారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌లోని సెక్షన్‌ 160కి సంబంధించిన ప్రొవిజన్‌ను ఉల్లంఘించినట్టయిం దని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో కవిత పేరు లేకపోయినప్పటికీ, కేంద్రంలో అధికారంలో ఉన్న అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీని అడ్డుగా పెట్టుకుని ఆమెపై రాజకీయ కారణాలతో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇది రాజకీయ కుట్రలో భాగమని పేర్కొన్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఈడీ విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయడానికి ధర్మాసనం అంగీకరించలేదు. ఈ విషయంలో కవిత చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణ జరపాలి
ఈడీ థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నదని కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అధికార పార్టీ ఆదేశాలతో ఈడీ తనను వేధిస్తున్నదని, తన విషయంలో ఈడీ చట్ట విరుద్దంగా వ్యవహరించిందని తెలిపారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదనీ, కొంతమంది వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో తనను ఇరికించారని పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్‌మెంట్లకు విశ్వసనీయత లేదని తెలిపారు. ‘ఈడీ థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నది. శరత్‌ చందా రెడ్డి అనే సాక్షిని కొట్టడమే దీనికి నిదర్శనం. అరుణ్‌ రామచంద్ర పిళ్లైను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారు. ఆయన తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈడీ అధికారులు నా సెల్‌ఫోన్‌ను బలవంతంగా తీసుకున్నారు. చట్ట విరుద్ధంగా నా ఫోన్‌ సీజ్‌ చేశారు. నా ఫోన్‌ సీజ్‌ చేసిన సమయంలో నా వివరణ తీసుకోలేదు. నా నివాసంలో, వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణ జరపాలి’ అని పేర్కొన్నారు. అలాగే, ఈ కేసులో తనకు ఈడి ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కోరారు. తనపై ఎలాంటి బలవంతపు(అరెస్ట్‌ వంటి) చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
నేడు ఈడీ ముందుకు కవిత
ఢిల్లీ మద్యం కుంభకోణంలో నేడు (గురువారం) ఈడీ ముందు ఎమ్మెల్సీ కె.కవిత హాజరుకానున్నారు. ఈ నెల 11న కవితను దాదాపు తొమ్మిది గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. నేడు మళ్లీ ఈడీ విచారించనుంది. కవిత విచారణకు అరుణ్‌ పిళ్ళై, బుచ్చిబాబు వాంగ్మూలాలు కీలకం కానున్నాయి.

Spread the love