లక్ష జన నినాదమే ప్రజాగర్జన

– సబ్బండ వర్ణాల సమీకరణే లక్ష్యం :
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ- ఖమ్మం
లక్ష మంది జన నినాదమే ఈ నెల 11న కొత్తగూడెంలో జరగనున్న ప్రజాగర్జన బహిరంగ సభ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని సీపీిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాపోరాటాలు, పార్టీ విస్తృతితో పాటు ఎన్నికలు కూడా పార్టీ కార్యక్రమంలో ఒక భాగమని స్పష్టం చేశారు. తొమ్మిదేండ్ల బీజేపీ పాలనపై నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల గ్రామాల్లో ప్రచారం చేయడంతో పాటు లక్ష మంది కార్యకర్తలను ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేలా చేశామని, ప్రత్యక్షంగా, పరోక్షంగా కోటి మందికి సందేశాన్ని అందించామన్నారు. ‘దేశ్‌కో బచావో – బీజేపీకో హఠావో’ నినాదంతో పార్టీ విస్తృత కార్యక్రమం తీసుకోవడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ మత భావజాలాన్ని నిలువరించ గలిగామన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి గడ్డుకాలం ప్రారంభమైందని, రామాలయం ఉన్న అయోధ్య మున్సిపల్‌ ఎన్నికల్లో సీపీఐ ఆరు స్థానాల్లో విజయం సాధించిందని, రామాలయం ఉన్న ప్రాంతంలో కూడా సీపీఐ అభ్యర్థి కౌన్సిలర్‌గా గెలుపొందారని తెలిపారు. ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకురావడంతో పాటు సీపీఐ భవిష్యత్‌ కార్యాచరణను ఈ బహిరంగ సభలో దిశా నిర్దేశం చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ అర్హులైన రైతుల స్వాధీనంలో ఉన్న భూమి ప్రకారం 11 లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆది నుంచి పార్టీకి దన్నుగా నిలిచిందని, అందుకే కొత్తగూడెంలో ప్రజాగర్జన సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అవినీతిమయమైన పాలక పార్టీల వల్ల ప్రజలు విసిగిపోయారని, కమ్యూనిస్టుల వైపు చూడక తప్పని రోజులు వస్తున్నాయని తెలిపారు. సమావేశంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, సహాయ కార్యదర్శి దండి సురేష్‌, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎస్కె జానిమియా, సిద్ధినేని కర్ణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.