పనుల్లో వేగం పెరగాలి

 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులపై
మంత్రి వేముల సమీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వరంగల్‌లో నిర్మిస్తున్న మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు, హైదరాబాద్‌ నలువైపులా నిర్మించనున్న ఆస్పత్రుల పనుల్లో వేగం పెంటాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లోని ఆర్‌ అండ్‌ బి కార్యాలయంలో అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఆర్కిటెక్ట్‌లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరంగల్‌ సూపర్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నమూనాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. జూన్‌ 22న తాను వరంగల్‌ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించనున్నట్టు తెలిపారు. ఎల్బీనగర్‌లో వెయ్యి పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను ఈనెల 26 వరకు ప్రారంభించాలని అధికారులకు, వర్క్‌ ఏజెన్సీకి మంత్రి స్పష్టం చేశారు. ఆ లోపు అన్ని రకాల టెక్నికల్‌ అంశాలు పూర్తి చేసుకోవాలనీ, 26న సైట్‌ విజిట్‌ చేసి వర్క్‌ ప్రోగ్రెస్‌ పరిశీలిస్తానని చెప్పారు. అల్వాల్‌లో 1200 పడకల ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను మొదలు పెట్టాలని వర్క్‌ ఏజెన్సీకి సూచించారు. ఈనెల 29 న అల్వాల్‌, సనత్‌నగర్‌ హాస్పిటల్స్‌ నిర్మాణ సైట్‌లను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తానని మంత్రి చెప్పారు.