అమరుల త్యాగాల స్ఫూర్తి

The spirit of the sacrifices of the immortals– సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర
– సైబరాబాద్‌ కమిషరేట్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
నవతెలంగాణ-మియాపూర్‌
పోలీసు అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు. శనివారం సైబరాబాద్‌ కమిషరేట్‌లో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ముందుగా అమరవీరుల స్మారక స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీసులు జాతి సేవకు పునరంకితం కావాలన్నారు. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసుల త్యాగాలను నిత్యం స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. దేశ భద్రత చూసుకునే బాధ్యత సైనికులదైతే, దేశంలోని అంతర్గత భద్రత చూసుకునే బాధ్యత పోలీసులదని చెప్పారు. సమాజంలో ఎవరికి ఏ కష్టం, నష్టం, వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసేనని అన్నారు. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు ప్రజారక్షణ, శాంతి పరిరక్షణ కోసం నిరంతరం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం జీవించి, మరణించే పోలీసులకి.. ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం చేసిన త్యాగానికి గౌరవం చూపించడం మనందరి బాధ్యత అన్నారు. పోలీసులు విధి నిర్వహణలో క్రమశిక్షణతో పని చేయాలన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 189 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్‌ అడిషనల్‌ సీపీ అడ్మిన్‌ అవినాష్‌ మహంతి, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ నారాయణ్‌నాయక్‌, డీసీపీ అడ్మిన్‌ రవిచందన్‌రెడ్డి, బాలానగర్‌ డీసీపీ శ్రీనివాసరావు, మాదాపూర్‌ డీసీపీ సందీప్‌, శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి, రాజేంద్రనగర్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, మేడ్చల్‌ డీసీపీ శబరీష్‌, డీసీపీ రోడ్‌ సేఫ్టీ ఎల్‌సి నాయక్‌, సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ఏడీసీపీ షమీర్‌, సీస్‌డబ్ల్యూ ఏడీసీపీ శ్రీనివాస్‌ రావు, ఏడీసీపీలు, ఏసీపీలు, సీఏఓ అకౌంట్స్‌ చంద్రకళ, సీఏఓ అడ్మిన్‌ గీత, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.