రామలీల వేడుకలకు ముస్తాబవుతున్న స్టేడియం 

నవతెలంగాణ-రామగిరి
దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా నిర్వహించే రామలీల వేడుకలకు సెంటినరీకాలనీ రాణిరుద్రమదేవి స్టేడియం ముస్తాబవుతోంది. ప్రతి ఏడు లాగే ఈ సంవత్సరం బీఆరెస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించడానికి రామలీల పనులు చురుగ్గా సాగుతున్నాయి. దసరా రోజు రాత్రి 7 గంటలకు జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో రావణ వధతో పాటు నాగసర్పాలు, మల్లె పందిరి, బాంబుల చెట్టు, విజిల్ పందిరి, రాకెట్ల మోతతో సెంటినరీకాలనీ పరిసర ప్రాంత ప్రజలకు ఆహ్లాదం పంచనున్నారు. ఈ వేడుకలను తిలకించిడానికి రామగిరి, కమాన్ పూర్, మంథని మండలాల నుండి సుమారు 6 వేల నుండి 8 వేల మంది వరకు ప్రతి ఏటా హాజరవుతుండగా ఎన్నికల వేళ కావడంతో ఈ సంవత్సరం సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆహుతలందరు  వేడుకలను తిలకించిడానికి నిర్వాహకులు రెండు రోజులుగా ముమ్ముర ఏర్పాట్లు చేస్తున్నారు.