– పరిశ్రమను ప్రభుత్వ అధీనంలోకి తీసుకొని ప్రారంభించాలి : కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి
నవతెలంగాణ జహీరాబాద్
చెరకు రైతులకు బకాయిపడ్డ డబ్బులు ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి అన్నారు. చెరకు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రైతు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలోని రైతులు ట్రాక్టర్లలో చెరకు గడ్డెలతో ర్యాలీకి తరలి వచ్చారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, సామాజిక ఉద్యమకారులు ఢిల్లీ వసంత్ కుమార్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి. రామచందర్, రైతు నాయకులు కొండల్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఎన్‌ఎస్‌ఎఫ్ చక్కెర పరిశ్రమలన్నింటినీ ఆంధ్ర పాలకులు కారుచౌకగా విక్రయించారని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ నేటికీ పరిశ్రమలను వెనక్కి తీసుకోకపోగా ఆయా పరిశ్రమలకు చెరకు తరలించిన రైతులకు డబ్బులు ఇప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.