డిస్కంల అప్పులకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం

The state government is responsible for the debts of the discoms– మోటార్లకు మీటర్లు పెట్టాలని మేం చెప్పలేదు
– వ్యవసాయం మినహా అన్నింటికీ మీటర్లు ఉండాలనే చెప్పాం
– తీర్చే సామర్థ్యం లేదనే కొత్త అప్పులు ఇవ్వట్లేదు : కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కంలు) అప్పులకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ స్పష్టంచేశారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదనీ, వ్యవసాయ కనెక్షన్లు మినహా మిగిలిన అన్నింటికీ కరెంటు వినియోగంపై పక్కా లెక్క ఉండాలని మాత్రమే చెప్పామని వివరించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నదని అన్నారు. గురవారం నాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఈసీ) ద్వారా తెలంగాణకు రూ.లక్ష 57 వేల కోట్లు మంజూరు చేసామనీ, వాటిలో రూ.19,700 కోట్లు మినహా మిగిలిన మొత్తాన్ని ఇప్పటికే రాష్ట్రానికి ఇచ్చశామన్నారు. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) ద్వారా రూ.1 లక్షా 8 వేల కోట్లు మంజూరు కాగా, రూ. 91 వేల కోట్లు విడుదల చేశామని చెప్పారు. పై రెండు సంస్థల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయాల్సిన నిధుల్లో సింహభాగం ఇప్పటికే ఇచ్చేశామన్నారు. కానీ కాళేశ్వరం, యాదాద్రి, సీతారామ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వద్ద అప్పులను తిరిగి చెల్లించేందుకు అవసరమైన ఆర్థిక స్థోమత లేని కారణంగా ఆ రుణాలను నిలిపివేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా విషయాల్లో అబద్ధాలు చెబుతున్న కారణంగానే రుణాలను ఆపాల్సి వచ్చిందని కేంద్రమంత్రి ఆరోపించారు. కేంద్రంపై అబద్ధ ప్రచారాలు చేస్తే తాము కూడా సరైన రీతిలోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు. ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ విషయంలోనూ సీఎం కేసీఆర్‌ ఇలాగే దుష్ప్రచారం చేస్తున్నాడనీ, కేంద్ర ప్రభుత్వానికి అలాంటి ఆలోచనలు లేవన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ పరిమితుల గురించి కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంటుందనీ, అది తమ పరిధిలోని అంశం కాదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రుణాలు చెల్లించే సామర్థ్యం ఆధారంగానే కొత్త రుణాలు ఇస్తారనీ, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఉండాలని సూచించారు. రాష్ట్రంలో డిస్కంల నష్టాలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. విద్యుత్‌ పంపిణీలో లీకేజీలు మొదలు బిల్లుల వసూలు వరకు అన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కారణంగానే నష్టాలు వస్తున్నాయని విశ్లేషించారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చినప్పుడు ఆ సొమ్మును డిస్కంలకు వెంటనే ఇవ్వాలనీ, అలా జరక్కుంటే నష్టాల్లోకి పోవడం సహజమేనని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ కేటాయించబడిన విద్యుత్‌ సంస్థల నుంచి తెలంగాణ కరెంటు తీసుకున్నదనీ, ప్రారంభంలో దానికి సంబంధించిన బిల్లులు కూడా చెల్లించిందని చెప్పారు. ఆ తర్వాత సమస్యలు తలెత్తడంతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లిందనీ, ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉందన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యుత్‌ రంగంలో సాధించిన పురోగతిని ఆయన వెల్లడిం చారు. ఇదే సమావేశంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై పలు ఆరోపణలు, విమర్శలు చేశారు.