పేదల కడుపు మాడుతోంది

– టైంకు బియ్యం సప్లయ్‌ కాక నిరుపేదలు అవస్థలు
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యానికి కోత పెట్టిన రాష్ట్ర సర్కారు రూపాయికి కిలో బియ్యం కూడా సక్కగ ఇస్తలేదు. రేషన్‌ షాపులకు సకాలంలో బియ్యం సరఫరా చేయకపోవడంతో పేదల కడుపు మాడుతోంది. దీనికితోడు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలను మళ్ళించడం, ఒక కారణమైతే సర్వర్‌ డౌన్‌, సిగల్‌ ప్రాబ్లమ్స్‌, వేయింగ్‌, బయోమెట్రిక్‌ మెషీన్లు పనిచేయకపోవడం మరో కారణం. జిల్లాలో వేలాది పేద కుటుంబాలు బియ్యం అందక తిప్పలు పడుతున్నాయి. రేషన్‌ షాపుల ద్వారా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది కానీ గడువును18వ తేదీ వరకు పొడిగించినా ఇప్పటివరకు రేషన్‌ దుకాణాలకు బియ్యం అందని పరిస్థితి నెలకొంది. కనగల్‌ మండలంలోని రేగట్టే, నల్లగొండ మండలంలోని గుండ్లపల్లి రేషన్‌ షాపులకు అసలు బియ్యం సరఫరా కాలేదు.
ఒకటో తేదీలోపు బియ్యం అందట్లే..
రేషన్‌ షాపులకు రావాల్సిన కోటాను ఆలస్యంగా ఇస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని డీలర్లు చెబుతున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ పూర్తి కాగానే..20 తేదీలోపు డీడీలు కట్టించుకొని, 30 తేదీలోగా ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి రేషన్‌ షాపులకు బియ్యం సరఫరా చేయాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం, స్టేజ్‌-2 కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వల్ల ఆలస్యమవుతోంది. స్టేజ్‌-2 కాంట్రాక్టర్లు నాలుగు లారీలు పెట్టాల్సిన చోట సమయానికి పెట్టకపోవడంతో సింగిల్‌, డబుల్‌ కోటాల విషయంలోనూ అధికారులకు క్లారిటీ లేకపోవడంతో ఆలస్యంగా డీడీలు కట్టించుకొని లేట్‌గా రిలీజ్‌ ఆర్డర్‌ ఇస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రెండు, మూడు విడతలుగా బియ్యం పంపుతున్నారు. ఉదాహరణకు 150 క్వింటాళ్ల కోటా ఉన్న షాపుకు తాపకు 50 నుంచి 100 క్వింటాళ్లు ఇస్తున్నారు. మార్చి నెల వరకు కేంద్రం ఇచ్చే ఫ్రీ రేషన్‌తో కలుపుకొని డబుల్‌ కోటా ఉండడంతో మూమెంట్‌ ఆలస్యమైందని చెప్పారు. కానీ, మూడు నెలల నుంచి సింగిల్‌ కోటానే ఇస్తున్నా పరిస్థితి మారలేదు.
సర్వర్‌, సిగల్‌ సమస్యలతో పరేషాన్‌..
రేషన్‌ పాపుల్లో ఆన్‌లైన్‌ విధానంలో బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీంతో మారుమూల ప్రాంతాల్లోనే కాకుండా పట్టణాల్లోనూ సిగల్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో సిగల్స్‌ కోసం ఇండ్లు, చెట్లపైకి ఎక్కి పడిగాపులు కాయాల్సి వస్తోంది. మాటిమాటికి సర్వర్‌ డౌన్‌ కావడం, లేదా ఓపెన్‌ కాకపోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. దీనికి తోడు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు వెళ్లడంతో నిరుపేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యంకు బ్రేక్‌ పడింది. దీంతో రేషన్‌ షాపులకు అందాల్సిన ఉచిత బియ్యం సమయానికి రాకపోవడంతో నిరుపేదలు రేషన్‌ దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అదేవిధంగా ఈ-పాస్‌, వేయింగ్‌ మెషీన్లు పనిచేయక డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మార్చి నెల నుంచి ఓటీపీ సిస్టమ్‌ తొలగించి మళ్లీ బయోమెట్రిక్‌ సిస్టమ్‌నే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వద్ధులతో పాటు కొంతమందికి వేలిముద్రలు పడడం లేదు. దీనివల్ల రోజుకు 50 మందికి కూడా బియ్యం పోయలేకపోతున్నామని డీలర్లు చెబుతున్నారు.
తరుగు భారం డీలర్లపైనే..
రేషన్‌ షాపులకు 50 కిలోల బియ్యం బస్తాలను సప్లై చేస్తున్నారు. ఇవి రైస్‌ మిల్లుల నుంచి స్టేజ్‌-1 గోడౌన్లకు, అక్కడినుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు, వాటి నుంచి రేషన్‌ షాపులకు చేరుతాయి. ఈ క్రమంలో సంచులు చిరిగిపోయి, రంధ్రాలు పడి బియ్యం పోతుంటాయి. దీంతో ఈ మూడు దశల్లో సంచులను కాంటా వేయాలి. కానీ ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో తూకం వేయకుండానే రేషన్‌ షాపులకు సప్లై చేస్తున్నారు. 50 కిలోల సంచుల్లో 47 నుంచి 49 కిలోల బియ్యం మాత్రమే వస్తున్నాయని డీలర్లు చెబుతున్నారు. వంద క్వింటాళ్లలో రెండు మూడు క్వింటాళ్లు తరుగు కిందే పోతున్నాయని, ఈ భారాన్ని తమపైనే మోపుతున్నారని వారు వాపోతున్నారు. ఆఫీసర్లను అడిగితే కాంటా వేశామని అంటున్నారని, దీనికి సంబంధించిన రిసిప్టులు ఇవ్వడం లేదంటున్నారు.
ఇంతవరకు రేషన్‌ షాప్‌కు బియ్యం రాలే…
దోమల పల్లి సైదమ్మ (నల్లగొండ మండలం అనంతారం)
ప్రతినెల ఐదవ తారీకులోపు రేషన్‌ షాపుకు బియ్యం వచ్చేవి. ఈనెల 20 తారీకు వరకు కూడా రేషన్‌ షాప్‌కి ఇంతవరకు బియ్యం రాలేదు. సమయానికి బియ్యం రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా సమయానికి రేషన్‌ షాపుకు బియ్యం సరఫరా చేయాలి.
లారీల కొరత వల్లనే ఆలస్యంగా రేషన్‌ సరఫరా
వైద్యుల సత్యనారాయణ (రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి)
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో లారీల కొరత తీవ్రంగా ఉండడంతో రేషన్‌ దుకాణాలకు బియ్యం సరఫరా ఆలస్యంగా జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే అదనపు లారీలతో రేషన్‌ దుకాణాలకు బియ్యం సరఫరా చేయాలి.