– తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్(సీఐటీయూ)
– యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మీ
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పట్ల ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య వైఖరి కారణంగానే సమ్మె చేయాల్సి వస్తోందని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ (సీఐటీయూ) యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మీ అన్నారు. గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీల సమ్మె పోరు సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆగస్టు 18వ తేదీన మంత్రి సమక్షంలో జాయింట్ మీటింగ్ జరిగిందని, ఈ సమావేశంలో అంగన్‌వాడీ టీచర్‌కు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్ష ఇస్తామని హామీనిచ్చారని గుర్తుచేశారు. కానీ అదే నెల 25వ తేదీన మాట మార్చి ఇందులో సగానికి తగ్గించారని చెప్పారు. ప్రభుత్వమే ఇలా భిన్నమైన వైఖరితో ఉండటం సరికాదన్నారు. తెలంగాణ వస్తే అందరినీ క్రమబద్ధీకరిస్తామని చెప్పారని, 40ఏండ్లకు పైగా వెట్టిచాకిరీ చేస్తున్న అంగన్‌వాడీలను మాత్రం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలు పదేండ్లుగా పోరాడుతున్నారని అయినప్పటికీ పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి పలుమార్లు వినతులు అందజేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అందుకే సమ్మె చేయాల్సి వచ్చిందని వివరించారు. డిమాండ్లు పరిష్కరించని యెడల సమ్మెను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు డి.వెంకటమ్మ అధ్యక్షత వహించిన సభలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, ఈశ్వర్‌రావు, కార్యదర్శి కూరపాటి రమేష్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.సునీత, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమోల్ల కిరణ్, జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్, లింగాల చిన్నన్న, సహాయ కార్యదర్శి ఎస్.నవీన్, నాయకులు డి.సునీత, రత్నమాల పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ ఆఫీసు ముందు అంగన్వాడీలు మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో అంగన్‌వాడీలు బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ దీక్ష శిబిరం వద్ద బిక్షాటన చేసి నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా బుగ్గారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్ష కొనసాగింది.