గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె జయప్రదం చేయాలి

– సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రవి కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
గ్రామ పంచాయతీ కార్మికులకు సమస్యల పరిష్కారం కోసం జులై 6 నుండి చేపట్టే నిరవధిక సమ్మెను కార్మికులంత జయప్రదం చేయలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రవి కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం హుస్నాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రవి కి సిఐటియు, కార్మిక నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవి కుమార్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జె.ఎ.సి. ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త చేపట్టే నిరవధిక సమ్మె కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలలో 50,000 మంది సిబ్బంది. పని చేస్తున్నారని అన్నారు. పేద, బలహీన వర్గాలకు చెందిన కార్మికులే నిత్యం మలినాలతో సహజీవనం చేస్తున్నారని అన్నారు. భారత రాజ్యాంగం లో ప్రభుత్వాలు ఉపాధి కల్పించాలని, స్థిరమైన వేతనాలు ఇవ్వాలని చెబుతున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో పాటు పంచాయతీలలో కొత్త కార్మికులను నియమిస్తూ సర్పంచ్ లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారాన్నరు. పంచాయతీలలో కొత్తగా కార్మికులను నియమిస్తే గ్రామ పంచాయతీ తీర్మానం, డి.పి.ఓ ఆమోదం తర్వాతనే ఈ నియామకాలను చేసి అక్రమ నియామకాలను అరికట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.51 తీసుకొచ్చి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. ప్రభుత్వం వివిధ రకాల కేటగిరీలను రద్దుచేసి కారోబార్, బిల్ కలెక్టర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందన్నారు. సిబ్బందితో నైపుణ్యం లేని పనులు చేయించడంతో అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పేరుతో అట్టహాసంగా కార్యక్రమాలను ప్రారంభించి ఫొటోలకు ఫోజులిస్తూ యాడ్స్ కొరకు వేల కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేసిందన్నారు. బిజెపి 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను దూకుడుగా అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను పెట్టుబడిదారులకు కారుచౌకగా అమ్మేస్తుందన్నారు. కార్మికవర్గం ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసిందన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఫిక్స్డ్ టర్మ్, డైలీవేజ్ తదితర రకాల పేర్లతో ఉపాధి పొందుతున్న కార్మికుల శ్రమను యధేచ్చగా దోచుకునేందుకు కనీసవేతన చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. పేదవాని కన్నీళ్ళు తుడవాల్సిన చేతులతో అరకొరగా ఉన్న విద్యా, వైద్యం తదితర సబ్సిడీలను రద్దు చేసిందన్నారు. అన్నదాతలకు కనీస మద్దతు ధరను నిర్ణయించడం లేదని, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు ప్రజలు, ఇతర తరగతుల కార్మికవర్గం, ఉద్యోగులు సంఘీభావం తెలియజేసి అండగా నిలబడాలని సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో పంచాయితీ కార్మికులు దుర్గయ్య, సమ్మయ్య, శ్రీకాంత్, లక్ష్మణ్, కనకయ్య, బాబు, కొమురయ్య, రాజవ్వ, నర్సవ్వ, పద్మ తదితరులు పాల్గొన్నారు.