పేదల పక్షాన పోరాటం ఆగదు

మతోన్మాద బీజేపీని గద్దె దించడమే సీపీఐ(ఎం) లక్ష్యం : గోదావరిఖని భూ పోరాట బహిరంగ సభ జయభేరిలో తమ్మినేని
– పక్కా ఇండ్లు, పట్టాలు ఇచ్చేవరకు ఉద్యమిస్తాం
– వేలాదిగా తరలి వచ్చిన పేదలు కలిసి వచ్చిన ట్రాన్స్‌జెండర్‌లు
– ఎన్నికల సమయంలో వచ్చే పార్టీలను నిలదీద్దాం

            ‘ఇది ఎన్నికల సమయం.. మనకు ఇచ్చిన హామీలు సాధించుకునే సందర్భం.. ఓట్ల కోసం పాలకులు గ్రామాలకు వస్తారు.. వాళ్లను నిలదీయాలి.. మన హక్కులు, మనకు ఇచ్చిన హామీలను సాధించుకునేందుకు పోరాడాలి.. మీకు సీపీఐ(ఎం) అండగా నిలుస్తుంది’ అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ‘బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నారు కదా అని పేదలకు ఇచ్చిన మాట గుర్తు చేయరని అనుకోవద్దు.. పేదల పక్షాన ఎప్పుడూ నిలబడుతాం. వారి హక్కులు సాధించే వరకు పోరాడుతాం’ అని అన్నారు.
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రెండు నెలలుగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాలు, పట్టాల కోసం ఉద్యమిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం జరిగిన పేదల భూపోరాట బహిరంగ సభలో తమ్మినేని ప్రసంగించారు.
దేశాన్ని మతం, కులం, తిండి, సంస్కృతి పేరుతో రావణ కాష్టం చేస్తున్న బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా సీపీఐ(ఎం) పని చేస్తుందని.. అందులో భాగంగా కలిసి వస్తున్న బీఆర్‌ఎస్‌కి మద్దతు ఇస్తున్నామని తమ్మినేని స్పష్టం చేశారు. మోడీకి వ్యతిరేకంగా గడ్డిపోచలను కూడా కలుపుకు పోతామని అన్నారు. ప్రజలు తలుచుకుంటే ఎంతటి నిరంకుశ పాలననైనా అంత మొందించొచ్చని కర్నా టక ప్రజలు నిరూపిం చారని చెప్పారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటూ విర్రవీగిన బీజేపీని ఓటు దెబ్బతో కొట్టి.. ప్రధాని పొగ రును దించారని అన్నారు. మతం పేరుతో అక్కడ బీజేపీ సాగించిన రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడారని గుర్తు చేశారు. బీజేపీ ఉచ్చులో పడొద్దని.. శ్రమజీవులకు మతం, కులం ఉండదని చెప్పారు. సమాజాన్ని నడిపించేది కష్ట జీవుల శ్రమే అన్నారు.
రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఇస్తామని, రెండు లక్షల ఇండ్లు కట్టిన ప్రభుత్వం ఎవరికీ ఇవ్వలేదన్నారు. దేశంలో ఇండ్లు లేని పేదలు ఉండరని, 2022 నాటికి పేదలందరికీ ఇండ్లు కట్టి ఇస్తామని చెప్పిన ప్రధాని మోడీ ఒక్క ఇల్లు కట్టిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 1.50లక్షల మంది ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్నారని, పోలీస్‌లతో లాఠీచార్జీలు చేయించి.. బుల్డోజర్లు పెట్టి గుడిసెలను కూల్చారని, అయినా మన పోరాటం ఆగడం లేదని స్పష్టం చేశారు.
ఇప్పటికే రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇప్పించిన చరిత్ర సీపీఐ(ఎం)కు ఉందని గుర్తు చేశారు. ఇకపైనా పేదలకు అండగా ఉంటామని, వారికి పక్కా స్థలాలు, ఇండ్లు కట్టిచ్చే వరకు పోరాటం ఆగదని చెప్పారు. త్వరలోనే సీఎంను కలుస్తామని, ఆయనకు లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.
డప్పు చప్పుళ్ళు, కోలాటాలతో భారీ ర్యాలీ
           గోదావరిఖని మున్సిపల్‌ కార్యాలయం నుంచి వేలాదిగా పేదలు ఎర్ర జెండాలు పట్టుకుని ర్యాలీగా బహిరంగ సభకు తరలివచ్చారు. పోతరాజుల విన్యాసాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బోనాలతో మహిళలు, సీపీఐ(ఎం) కార్యకర్తలు నృత్యాలు చేసుకుంటూ వచ్చారు. ర్యాలీ సాగినంతసేపు దారి పొడువునా ఇండ్ల పట్టాల కోసం నినాదాలు చేశారు. ప్రజానాట్యమండలి కళాకారుల ఆట పాటలు సభికులను చైతన్య పరిచాయి. సీపీఐ(ఎం) పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి వై.యాకయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సీనియర్‌ నాయకులు బిక్షమయ్య, నాయకులు రాజిరెడ్డి, వేల్పుల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన హామీలు మరిచిన సర్కార్‌
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిందని, క్యాబినెట్‌ మీటింగ్‌లో కూడా పేదల భూ పోరాటంపై మాట్లాడలేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ నాయకులు భూపాల్‌ అన్నారు. సీపీఐ(ఎం) చేస్తున్న పోరాటం ఓట్ల కోసమో, తమ బలం చూపించేందుకు కోసమో కాదని, పేదలకు న్యాయం చేయాలని పోరాడుతుందని చెప్పారు. మన పోరాటాలకు బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా మద్దతు ఇస్తున్నారని, ఇక్కడ స్వయంగా ఎమ్మెల్యే కోరుకంటి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఇండ్ల పోరాటమే కాదు.. మున్సిపల్‌, గ్రామ పంచాయతీ, పరిశ్రమల కార్మికుల పక్షాన కూడా ఎన్నో పోరాటాలు చేస్తున్నామని చెప్పారు.
– భూపాల్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ నాయకులు