నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో విభిన్న వాతావారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి తేలికపాటి వర్షం పడుతున్నది. ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉదయం పూట మాత్రం ఎండ వేడిమికి, ఉక్కపోతకు తాళలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో అత్యధికంగా 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.
అదే సమయంలో వికారాబాద్ జిల్లా బొమరాస్‌పేటలో అత్యధికంగా 3.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాబోయే మూడు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో 38 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులు వీయొచ్చనీ, అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలున్నాయని తెలిపారు. రాబోయే 48 గంటల పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై అక్కడక్కడా చిరుజల్లులు పడే అవకాశముందని పేర్కొన్నారు.