రెంజల్ లో ఉద్రిక్తత, రైతుల దీక్ష భగ్నం..

– రైతులతోపాటు, అధికార పార్టీ నాయకుల అరెస్ట్..
నవతెలంగాణ- రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ గాంధీ విగ్రహం ముందు చేపట్టిన రైతుల దీక్ష 46వ రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం నుంచి రైతు దీక్షా శిబిరం ఎదుట అధికార పార్టీ నాయకులు బైఠాయించి మాటల యుద్ధం కొనసాగింది. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే బోధన్ రూరల్ సిఐ, టౌన్ సిఐ తో పాటు, రెంజల్ ,ఎడపల్లి బోధన్ ఎస్ఐలతో పాటు, పోలీస్ స్టేషన్లో నుంచి పోలీస్ బలగాలు మోహరించారు. రైతులు, అధికార పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇద్దరిని పోలీస్ యంత్రాంగం పలుమార్లు చర్చలు జరిపిన వినకపోవడంతో, బోధన్ ఎసిపి ఆదేశాల మేరకు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. రెండు డీసీఎంలను తీసుకువచ్చి బలవంతంగా వారిని అక్కడి నుంచి తరలించి వేశారు. అధికార పార్టీ నాయకులు ప్రోసిడింగ్ ఆర్డర్లను చూయించినా, పనులను ప్రారంభించేంతవరకు దీక్షను విరమించే ప్రసక్తే లేదని వారు పట్టుపట్టారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించారు. అధికార పార్టీ నాయకులు సీఎం కేసీఆర్, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రైతులకు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇస్తు తమ నాయకుడిని బదనాం చేస్తున్నారని అధికార పార్టీ నాయకులు విమర్శించారు. విధి లేని పరిస్థితిలో పోలీస్ శాఖ వారు స్పెషల్ ఫోర్సునదించి రెండు వర్గాల వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. గాంధీ విగ్రహం ఎదుట ఏర్పాటు చేసుకున్న రైతుల దీక్ష శిబిరాన్ని పోలీసులు తొలగించి వేశారు.