ఆమె… తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపునింపుతుంది. కట్టుకున్న వాడు పట్టనట్టు తిరుగుతున్నా ఓపికతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. సమాజం ఎంతగా అవహేన చేస్తున్నా పిల్లల కోసం అన్నీ భరిస్తుంది. సొంత గూడు కోసం కలలు కుంటుంది. తన వాళ్ళ కోసం ఎంతైనా శ్రమిస్తుంది. అదే మహిళ తన శ్రమను దోచుకుంటున్నారని గుర్తించిన రోజు తిరగబడుతుంది. సమానత్వం కోసం దిక్కులు దద్దరిల్లేలా నినదిస్తుంది. తనూ ఓ మనిషినే అంటూ సాధికారతకై ఉద్యమిస్తోంది. అలా ఐక్యతతో వారు ఉద్యమించేందుకు చేయూ తగా నిలుస్తోంది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా). ఐద్వా జెండ నీడలో వేలాది మంది మహిళలు ఏకమై తమ సమస్యలపై ఉద్యమిస్తున్నారు. హింసకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నారు. మనువాదం పేర అడుగడుగున్నా తమను అణిచివేయాలని చేస్తున్న పాలకులపై గళం విప్పుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా సీపీఐ(ఎం) అండతో తమకంటూ సొంత గూడును సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బిజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. దేశ వ్యాప్తంగా లైంగిదాడులు, హింస పెరిగిపోయింది. తాము ఎందుకు అణిచివేయ బడుతున్నామో తెలియకుండానే మహిళలు శ్రమ దోపిడికి గురవుతున్నారు. అలాంటి మహిళల్లో చైతన్యం కల్పించేందుకు ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యాభైవేల కరపత్రాలు వేసి ప్రచారం చేశారు. బతుకమ్మా అంటూనే మహిళలను బలితీసుకుంటున్నారని మహిళలకు రక్షణ కల్పించాలంటూ నినదిస్తున్నారు. మనుధర్మం పేరుతో మహిళను కించపరచడాన్ని ప్రశ్నిస్తున్నారు.
అవగాహన కల్పిస్తూ…
బిల్కిస్‌బానోపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన దుర్మార్గులను విడుదల చేసినపుడు తిరగబడ్డారు. మణిపూర్‌లో మతోన్మాదులు ఓ మహిళను నగంగా ఊరిగించిన నాడు మండిపడ్డారు. కోల్‌కతా డాక్టర్‌పై జరిగిన అమానుషానికి ఎదురుతిరిగారు. ఇటువంటి హింస నుండి మహిళలను రక్షించుకోవడం, ప్రజల్లో, యువతలో అవగాహన కల్పించడం తమ బాధ్యతగా భావించింది ఐద్వా. అందుకే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది కాలేజీల్లో, హాస్టళ్లలో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. 33 శాతం రిజర్వేషన్ కోసం ఏండ్ల నుండి కొట్లాడుతున్నారు. మహిళా సంఘాల ఉద్యమాలకు ప్రభుత్వం దిగొచ్చింది. కానీ దాన్ని ఆచరణలో మాత్రం చూపడం లేదు. జనగణనకు, నియోజక వర్గాల పునర్విభజనకు మహిళా రిజర్వేషన్‌ను ముడి పెట్టి కాలయాపన చేస్తోంది. దీన్ని వెంటనే అమలు చేయాలని పార్లమెంటు సమావేశాల సందర్భంగా పాద యాత్రలు చేశారు. సామాన్య, మధ్య తరగతి ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేశారు.
బస్సు సాధించుకున్నాం
మా తమ్మడిపల్లి(జీ) గ్రామంలో ఎప్పుడూ బస్సు సమస్య ఉండేది. స్కూల్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే బస్సు ఉండేది. వేసవి సెలవులు ఇచ్చినప్పుడు తిరిగి వచ్చేది కాదు. ప్రతి ఏడాది డిపోకి వెళ్ళి మాట్లాడితే అప్పుడు పంపించేవారు. వేసవిలో విద్యార్థులు ఫీజులు కట్టేందుకు టౌన్‌కు వెళ్లాల్సిందే. ఆ సమయంలో బాగా ఇబ్బంది ఉండేది. ఆటోల వాళ్లు డిమాండ్ చేసేవారు. అందుకే ఎలాగైనా మా ఊరికి బస్సు సాధించుకోవాలని అనుకున్నా ము. అప్పట్లో నేను ఐద్వా మండల కార్యదర్శిగా ఉన్నాను. మొదటి సారి ఈ సమస్యపై పేపర్లో ప్రకటన ఇచ్చాం. యూట్యూబ్‌లో కూడా మాట్లాడాం. తర్వాత ఊరి మహిళలతో పాటు విద్యార్థినులు కూడా మా ఉద్యమంలో పాల్గొన్నారు. ఎందుకంటే బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల ఆడపిల్లలను తల్లిదండ్రులు కాలేజీలకు పంపలేకపోతున్నారు. చివరకు డిపో మేనేజర్ స్పందించారు. విశ్వనాథపురం, సీగారం, తానేదార్‌పల్లి, సూరారం, షాపల్లి గ్రామల నుండి మా ఊరికి బస్సు వస్తుంది. మా ఒక్క ఊరికి బస్సు వస్తే ఇన్ని గ్రామాలను కవర్ చేయవచ్చు. ప్రస్తుతం తమ్మడిపల్లి వరకు రోజూ బస్సు వస్తుంది. అయితే ఒక్క బస్సు మాత్రమే పెట్టారు. ఇంకో బస్సు కావాలని అడుగుతున్నాం. – ఎండి. షబానా, జనగాం జిల్లా కార్యదర్శి (ఐద్వా)
సీపీఐ(ఎం) అండతోనే…
2022 మార్చి 28 నుండి భూపోరాటం మొదలుపెట్టాం. నాపైన నాలుగు కేసులు పెట్టారు. లోకల్ రాజకీయ నాయకుల నుండి ఒత్తిడి, రౌడీ షీటర్ల నుండి బెదిరింపులు మొదలయ్యాయి. అయినా భయపడలేదు. సీపీఐ(ఎం) పార్టీ మాకు అండగా ఉంది. వారిచ్చిన ధైర్యంతో పోరాటం కొనసాగించాం. రాజీవ్‌గృహకల్ప నిర్మాణం పూర్తి కాలేదు. అయినా 300 కుటుంబాలు అందులో ఉంటున్నాయి. స్థలాల్లో గుడిసెలు వేసుకొని మరో 300 కుటుంబాలు ఉంటున్నాయి. నాలుగేండ్ల నుండి ఇన్ని కుటుంబాలు ఉంటున్నా ప్రభుత్వం స్పందించలేదు. పైగా మాపై లాఠీ ఛార్జీ చేస్తున్నారు. ప్రతి ఏడాది వరదలు వస్తున్నాయి. ఇంట్లో సరుకులు మొత్తం కొట్టుకుపోయి తిండి లేక ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం స్పందించలేదు. దాంతో భూపోరాట కమిటీ ఆధ్వర్యంలో వంటలు వండి అందరికీ పెట్టుకున్నాం. సీపీఐ(ఎం) పార్టీనే మాకు అన్ని విధాలుగా అండగా నిలబడింది. చివరకు పోరాడి ఇల్లు సాధించుకున్నాం. పట్టాలు, కరెంటు మీటర్ల కోసం ఇప్పుడు కొట్లాడుతున్నాం. అవి కూడా సాధించుకొని తీరతాం.
– అప్పాజీ వాణి, కిలోవరంగల్, మల్లుస్వరాజ్యం నగర్
మేము ఇక్కడే ఉంటాం
ఎన్నో ఏండ్ల నుండి కిరాయికి ఉంటున్నాం. మాకు వచ్చే కొద్ది జీతం కిరాయికి, కరెంటు బిల్లులు కట్టడానికే సరిపోతుంది. ఇక పిల్లల్ని ఎలా చదివించాలి. అందుకే రెండేండ్ల నుండి ఇండ్ల స్థలం కోసం పోరాటం చేస్తున్నాం. 2023లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో భూపోరాటం జరుగుతుందని తెలుసుకుని మేమూ ఇందులోకి వచ్చాము. పార్టీ నాయకులు మాకు అన్ని విధాలుగా అండగా నిలబడుతున్నారు. ఐదారు నెలల నుండి ఇక్కడే ఉంటున్నాం. మొన్నటి వరకు చీకట్లో పాములు, తేళ్ల మధ్య బతికాం. ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. అందుకే మా సొంత ఖర్చులతో బోర్లు, కరెంటు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు రోడ్లు కూడా వేసుకుంటున్నాం. వర్షాకాలం ఇబ్బంది అని అందరం ఒక దగ్గర ఉండేలా ఒక హాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. మా ఐక్యమత్యాన్ని చూసి స్థానిక ప్రజాప్రతినిథులు మాత్రం మీకు ఇళ్లు ఇస్తాం అంటున్నారు. ఇచ్చే వరకు మేము సీపీఐ(ఎం) అండతో ఇక్కడే ఉంటాం.
– భాగ్యలక్ష్మి, గోదావరిఖని, మల్లుస్వరాజ్యం నగర్
నిజమైన సాధికారతకై…
ఐద్వా ఆధ్వర్యంలో మహిళలను పోగేసి ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. నిజమైన సాధికారతకై ఉద్యమిస్తున్నాం. మహిళా సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిత్యం కృషి చేస్తున్నాం. కాయా కష్టం చేసి సంపాదించుకున్న డబ్బు కొద్దిగైనా పొదుపు చేసుకోవాలనే ఉద్దేశంలో రాష్ట్రంలో లక్షల మంది మహిళలు పొదుపు గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 55 వేల గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. కానీ వీరికి లోన్లు ఇవ్వకుండా బ్యాంకులు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యపై ఐద్వా ఎన్నో పోరాటాలు చేసింది. మేనేజర్‌లతో మాట్లాడి లోన్లు ఇప్పించి మహిళలు ఆర్థికంగా బలపడేలా కృషి చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చింది చాలా సంతోషం. కానీ నేటికీ బస్సులు వెళ్లని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ప్రజలకు సరిపడా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే బస్సుల సంఖ్య పెంచాలని డిపో మేనేజర్లకు వినతిపాత్రాలు ఇచ్చాము. జనగాం జిల్లాలో ఓ గ్రామంలో ఐద్వాగా పోరాటం చేసి బస్సు సాధించుకున్నాం. అలాగే ఇండ్ల కోసం మహిళలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. పోరాటాలు చేస్తున్నారు. త్యాగాలు చేసి జైలుకు కూడా పోతున్నారు. న్యాయం కోసం మహిళలు చేసే ప్రతి పోరాటంలో సీపీఐ(ఎం) అండగా వుంటుంది.
– మల్లు లక్ష్మి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి