‘నో క్యాస్ట్‌ నో రిలీజయన్‌’ కాలంపై హైకోర్టు తీర్పు హర్షణీయం

– జస్టిస్‌ చంద్రకుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
విద్యతో పాటు ఇతర అన్ని దరఖాస్తుల్లో నో క్యాస్ట్‌ నో.. రిలీజియన్‌ అనే కాలమ్‌ను తప్పకుండా. చేర్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడాన్ని కుల, మతాంతర వివాహాల రక్షణ ఐక్య వేదిక చైర్మెన్‌ జస్టిస్‌ చంద్ర కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. కులాన్ని మతాన్ని వదులుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందనీ, ఆ స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవ్వరికీ లేదని తెలిపారు. అలాంటి దరఖాస్తులను తిరస్కరించే హక్కు ఏ అధికారికి లేదనీ, ఆ మేరకు మున్సిపాల్టీ కమిషనర్లకు, విద్యాశాఖ కమిషనర్లకు న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయటం మంచి పరిణామమని పేర్కొన్నారు. అలాంటి అప్లికేషన్లను తిరస్కరించే పద్ధతి రాజ్యాంగంలో లేదనీ, అది లౌకిక స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. అది ఆర్టికల్‌ 14, 19, 21 25ను ఉల్లంఘించటమే అవుతుందంటూ జస్టిస్‌ కన్నెగంటి లలిత చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇది ఒక సంచలన తీర్పు అని కొనియాడారు. దీనిని తక్షణమే అమలు చేయాలని కోరారు. కోర్టు తీర్పుపట్ల కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్‌ బాబు, కేఎన్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి. వహీద్‌, ఎస్‌వీకే కార్యదర్శి ఎస్‌.వినరు కుమార్‌,టీపీఎస్‌కే నాయకులు భూపతి వెంకటేశ్వర్లు తదితరులు కూడా హర్షం వ్యక్తం చేశారు.