– కేంద్రం సహకరిస్తే మరింత వేగంగా గ్రామాల అభివృద్ధి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
– రాష్ట్ర స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్-2023 అవార్డుల ప్రధానోత్సవం
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రాష్ట్రంలో గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని గ్రామీణాభివృద్ధి సంస్థలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్-2023 అవార్డుల ప్రధానోత్సవానికి మంత్రి హాజరై మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పంచాయతీరాజ్ శాఖలోని చట్టాల్లో సమూల మార్పులు చేసి గ్రామీణ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారన్నారు. రూ.35వేల కోట్లతో ఇంటింటికీ తాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి కష్టాలు వర్ణనాతీతమని తెలిపారు. కేంద్రం పూర్తిగా సహకరిస్తే గ్రామీణ ప్రాంతాలు మరింత వేగంగా అభివృద్ధి జరుగుతాయని తెలిపారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపుల్లో కేంద్రం పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో కూడా రాష్ట్రానికి అన్ని రంగాల్లో అవార్డు లభించడం గొప్ప విషయమని తెలిపారు. ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు పొందిన గ్రామాలకు వెంటనే రూ.10 లక్షల నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అక్టోబర్ 2న కేంద్రం ప్రకటించే అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికే అన్ని అవార్డులు వస్తాయని స్పష్టం చేశారు.రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం నేద్నూర్ గ్రామం రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తమ గ్రామంగా ఎంపికైనందున జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ప్రభాకర్, గ్రామ సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి, సంబంధిత మండల ఎంపీడీఓలు, ఎంపీఓలను మంత్రి అభినందించారు. అనంతరం ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డును అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయత్ రాజ్ సంచాలకులు హన్మంతరావు, సెర్ప్ సీఈఓ గౌతమ్, ఎస్‌బీఎం డైరెక్టర్ సురేష్‌బాబు, సంబంధిత అధికారులు, గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, డీపీఓలు డీఆర్డీఓలు, తదితరులు పాల్గొన్నారు.