వీఓఏల సమ్మెను వెంటనే పరిష్కరించాలి

– బతుకమ్మలతో ఆట-పాట టెంట్‌ వద్ద రాత్రి నిద్ర
నవతెలంగాణ-నల్లగొండ
ఐకేపీ వీఓఏల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గత 34 రోజులుగా సమ్మె చేస్తున్న వారి సమస్యలు పరిష్కరించి, సమ్మెను విరమింప చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం రాత్రి తిప్పర్తి మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో వీఓఎలు బతుకమ్మలతో ఆటపాట టెంట్ల వద్ద నైట్‌ నిద్ర కార్యక్రమంతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 18 వేల మంది ఐకేపీ వీఓఏల లక్షలాది మంది మహిళలని సామాజిక ఆర్థిక రంగాల్లో ముందుకు తీసుకుపోవడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారన్నారు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో కుటుంబ పోషణ భారమై అర్దాకలితో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కనీస వేతన చట్టం 1948 ప్రకారం 26 వేల కనీస వేతనం ఇవ్వాలని సమ్మె చేస్తున్నారని ప్రభుత్వం జోక్యం చేసుకొని సమ్మెను పరిష్కరించాలని కోరారు. వీఓఏల డిమాండ్‌లు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగుతుందని, ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నన్నూరి వెంకటరమణారెడ్డి, సీఐటీయూ మండల కన్వీనర్లు భీమగాని గణేష్‌, నరసింహ, ఐకేపీ వీఓఏల ఉద్యోగుల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎల్క కోటిరెడ్డి లెంకల వసంత, నాయకులు మంత్రాల మంగమ్మ, రుమాన మల్లయ్య, స్రవంతి, అశ్విని, సునీత ,నాగమ్మ, సువర్ణ, అన్నపూర్ణ, సామ్రాజ్యం, రమణ, లక్ష్మి, వసుమతి, పుష్ప, విజయ, పార్వతి, సంధ్య, జయమ్మ, అనిత, జయమ్మ, నాగరాజు, సైదులు తదితరులు పాల్గొన్నారు.