– పోరాడే చేతికే ఓటు ఆయుధం ఇవ్వండి
– ఆమరణ నిరాహార దీక్ష చేసైనా మూసీని శుద్ధి చేయిస్తా : భువనగిరి
– పార్లమెంటు నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్
నవతెలంగాణ-నకిరేకల్
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే వారి చేతికే ఆయుధం ఇవ్వాలని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్ ప్రజలను కోరారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణ కేంద్రంలోని నర్రా రాఘవరెడ్డి భవనంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిత్రను చూసి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు డబ్బు విషయంలో మెరిట్‌గా ఉంటారని, సీపీఐ(ఎం) అభ్యర్థిగా తాను నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై అవగాహనతోపాటు వాటి పరిష్కారం కోసం పోరాడేతత్వంలో మెరిట్‌గా ఉంటానని అన్నారు. 35 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజాసమస్యలపై పనిచేసిన అనుభవం తనకుందని తెలిపారు. తనను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం లో దశాబ్దాలుగా ఇరిగేషన్ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. ప్రభుత్వాలు మారినా.. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పనులు మాత్రం ముందుకు సాగడం లేదన్నారు. జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేస్తామంటున్నారు కానీ.. ఎప్పటిలోగా చేస్తారో చెప్పగలరా అని ప్రశ్నించారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎందుకు పెండింగ్‌లో ఉందో చెప్పాలన్నారు. జనగామ దేవాదుల కాలువ నిర్మాణం 30 ఏండ్లు గడుస్తున్నా పూర్తి కాలేదన్నారు. 23 ఏండ్లు గడుస్తున్నా బస్వాపూర్ ప్రాజెక్టు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలేరు గంధమల్ల ప్రాజెక్టు ఎటు పోయిందని ప్రశ్నించారు. పరిశ్రమల కాలుష్యంతో జీవనధార మూసీ నది డంపింగ్ యార్డ్‌గా మారినా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నదిలో సుమారు 70 కిలోమీటర్ల మేర విష జలాలు ప్రవహిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కల్పించుకుని.. ప్రథమంగా మూసీ శుద్ధీకరణ చేయాలని కోరారు. మూసీ శుద్ధీకరణకు సుమారు రూ.58 వేల కోట్లు అవసరం కాగా.. బడ్జెట్‌లో రూ.1000 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. మూసీ నదిని మూడు జోన్లుగా విభజించారని, ఏ జోన్‌ను మొదట సుందరీకరిస్తారో చెప్పాలన్నారు. మూసీ నది ప్రక్షాళనపై ప్రభుత్వం ప్రణాళికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తనను పార్లమెంటు సభ్యునిగా గెలిపిస్తే ఆమరణ నిరాహార దీక్ష చేసైనా మూసీని శుద్ధీకరణ చేయిస్తానని హామీ ఇచ్చారు.
ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని, బీబీనగర్‌లో ఎయిమ్స్ మూడేండ్ల నుంచి పూర్తి కావడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం లేదన్నారు. వీటన్నింటిని పరిష్కరించేందుకు, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు వచ్చే ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందాల ప్రమీల, నాయకులు రాచకొండ వెంకట్‌గౌడ్, బొజ్జ చిన్న వెంకులు, వంటేపాక వెంకటేశ్వర్లు, లకపాక రాజు, ఆకుల భాస్కర్, సాకుంట్ల నరసింహ, ఒంటెపాక కృష్ణ, బాలస్వామి పాల్గొన్నారు.