విద్యార్థులు తిరగబడతారనే వర్సిటీల నిర్వీర్యం

– పార్టీ అధ్యక్షుడిని మార్చబోం : ఇంద్రసేనారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం కోసం వర్సిటీ కేంద్రాలుగా విద్యార్థు లంతా ఏకమై కొట్టాడినట్టే… ఇప్పుడు తన ప్రభుత్వ లోపాలపై ఎక్కడ తిరగబడతారోనన్న భయంతోనే రాష్ట్రంలోని యూని వర్సిటీలను కేసీఆర్‌ నిర్వీర్యం చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో తమ పార్టీ అధ్యక్షుడి మార్పు ఉండబోదనీ, బండి నేతృ త్వంలోనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చలేదని వివరిస్తూ ఆ పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపర్చిన వాగ్దానపు కాఫీని తగులబెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేజీ టూ పీజీ విద్య ఏమైందని ప్రశ్నించారు. యూనివర్సిటీలో 66 శాతం బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీలున్నాయని చెప్పారు. ఏం ఘనత సాధించారని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని నిలదీశారు. కేంద్రంలోని మోడీ తొమ్మిదేండ్ల పాలనలో ప్రజలకు ఎంతో మేలు చేశామని పలు పథకాల గురించి పేర్కొంటూ వివరించారు. అధికార ప్రతినిధి కిశోర్‌ మాట్లాడుతూ.. ఐటీ రంగంలో ప్రత్యక్షంగా 9.5 లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా 27 లక్షల ఉద్యోగాలు సృష్టించామని కేటీఆర్‌ చెబుతున్న లెక్కలన్నీ పచ్చి అబద్ధమన్నారు. ఐటీరంగంపై సమాచారం ఇవ్వాలని ఆర్టీఐ ద్వారా అడిగితే లెక్కలు లేవని చెప్పిన సర్కారుకు ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు.